సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది! కృష్ణా జలాలపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు తెలంగాణలోని పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు పెంచాలన్న వినతిని కేంద్రం తిరస్కరించడం, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల పాత వాటాయే ఈ ఏడాదీ కొనసాగుతుందని పేర్కొనడం రాష్ట్రానికి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టనుంది. బచావత్ అవార్డుల ప్రకారమైనా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో ఎగువ తెలంగాణకు దక్కే నీటి వాటాలు తేల్చాలని కోరుతున్నా కుదరదన్న ధోరణి ప్రదర్శించడం రాష్ట్రానికి మింగుడు పడని అంశమే. జూన్ వర్షాలకు మరో రెండు నెలల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో కేంద్రంపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది.
పరీవాహకం ఎక్కువ ఉన్నా తక్కువ నీటి కేటాయింపు...
రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5 శాతం, ఆయకట్టు 62.5 శాతం ఉంది. అయినప్పటికీ మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీనికితోడు 1978లో గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరుతోంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని అడుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment