
ఇన్‌పుట్ సబ్సిడీ.. ఖజనాలో బందీ
చేప చేప ఎందుకు ఎండలేదు... అన్నట్లు పంటనష్ట పరిహారం పంపిణీలో ఇంత జాప్యానికి కారణమెవరు..? పరిహారపు జాబితాలో అనర్హులున్నారని నిలదీసిన రాజకీయ నేతలా...? అసలు పంట నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేయని వ్యవసాయ శాఖనా...? క్షేత్రస్థాయిలో అనర్హుల ఏరివేతకు సహకరించని రెవెన్యూ శాఖనా..? బిల్లులు విడుదల చేయటంలో తాత్సారం చేస్తున్న ట్రెజరీ విభాగమా..? ఇంత జరుగుతున్నా పట్టింపు లేని అధికారులా..? కారణమెవరైనా.. సర్కారు విడుదల చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ రెండు నెలలుగా ఖజానాలో మూలుగుతోంది. పంటనష్టంతో చితికిన అన్నదాతలకు అందని ద్రాక్షలా ఊరిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
గత నెలలోనే రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పరిహారం ఇప్పటికీ కలెక్టరేట్ ఖజానా దాటలేదు. గడిచిన అయిదేళ్లలో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.105.92 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఆగస్టులో వచ్చిన ఈ డబ్బు ఇప్పటికీ జిల్లా ఖజనాలోనే మూలుగుతోంది. స్వయానా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలతో గత నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మాటిచ్చిన జిల్లా యంత్రాంగం ఇప్పటికీ అర్హులెవరంటూ ఆరా తీసే విచారణ పేరుతోనే సాగదీస్తోంది.
నాలుగేళ్ల వ్యవధిలో వివిధ సందర్భాల్లో వడగళ్ల వానలు.. అకాల వర్షాలతో వరద నష్టంతో లక్షకుపైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 86,000 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. 1.80 లక్షల మంది రైతులు నష్టపోయిన జాబితాలో ఉన్నారు. 2009 నుంచి వరుసగా మూడు సీజన్లలో వడగళ్ల వానలతో 29,392 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 76,365 మంది రైతులు నష్టపోయారు.
యాభై శాతానికి మించి నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. రైతుల జాబితాలను సైతం సిద్ధం చేసింది. వాటి ఆధారంగానే ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఈ పరిహారం జాబితాలో అర్హులకు బదులు అనర్హులున్నారని, ఆదర్శ రైతులు ఇష్టమొచ్చిన పేర్లు రాసుకున్నారని గత నెలలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష, అధికారపక్ష నేతల మధ్య వాగ్వివాదం జరిగింది.
స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ కేవలం అర్హులైన రైతులకు మాత్రమే పరిహారం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ వీరబ్రహ్మయ్య పంట నష్టపోయిన రైతుల జాబితాలను విచారణ చేయాలని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. 1బీ రిజిస్టర్ ఆధారంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 23వ తేదీవరకు అర్హులను గుర్తించి 30 లోగా రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని గడువు విధించారు.
కానీ.. ఈ విచారణ ఇప్పటికీ సాగుతూనే ఉండటం రైతుల పాలిట శాపంగా మారింది. మొత్తం రూ.105.92 కోట్లలో కలెక్టర్ విచారణకు ఆదేశించకముందే మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.18.86 కోట్లు పంపిణీ జరిగింది. దాదాపు 76,365 మంది రైతుల ఖాతాల్లో జమయింది. మిగిలిన రూ.87.09 కోట్ల పంపిణీకి సంబంధించిన విచారణ మొదలైంది. మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ ప్రక్రియ నత్తనడక పట్టింది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 10 మండలాల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. పలుచోట్ల అనర్హులున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన మిగతా మండలాల్లో విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిహారం రైతులకు అందే పరిస్థితి లేదు.
కనీసం అర్హుల జాబితాలు సిద్ధమైన మండలాల్లో పంపిణీకి వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ట్రెజరీ దాటడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ పరిహారం చెల్లింపునకు సంబంధించి మండలాల వారీగా ప్రొసీడింగ్‌లు, బిల్లులను తయారు చేసి ట్రెజరీకి అప్పగించాలి. అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. జిల్లాలోని నోడల్ బ్యాంకులో నిధుల జమ అవుతాయి. అక్కణ్నుంచి రైతుల ఖాతాలున్న బ్యాంకు బ్రాంచీలకు బదిలీ అవుతాయి.
అసలు బిల్లులే ఇవ్వకుంటే డబ్బులెలా ఇస్తామని ట్రెజరీ అధికారులు తప్పును వ్యవసాయ శాఖ అధికారులపైకి నెట్టేస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ తేల్చేస్తోంది. కారణమేదైనా.. పట్టింపులేని తనం ఎవరిదైనా... జిల్లా అధికారుల నిర్వాకంతో సకాలంలో బాధిత రైతులకు ఈ పంపిణీ చేయాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఇప్పటికీ విచారణ పేరుతో కాలాతీతం చేస్తున్నాయి.