స్ఫూర్తినిచ్చిన సకల జనుల సమ్మె
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మెకు ఈనెల 13వ తేదీతో మూడేళ్లు పూర్తికానున్నాయి. స్వరాష్ట్రం కోసం సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాల్లో కార్మికులు, అధికారులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు ఎంతో పలువురికి స్ఫూర్తినిచ్చాయి. ప్రధానంగా సకల జనుల సమ్మెను పురస్కరించుకుని సుమారు నెలన్నర రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన లు చేపట్టిన కార్మికుల పోరాటాలు చిరస్థాయి గా నిలిచిపోతాయని చెప్పవచ్చు.
ఈ క్రమంలో స్వరాష్ట్ర సాధనకోసం సుదీర్ఘకాలం నిర్వహిం చిన సమ్మెలో పాల్గొన్న కార్మికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ బొగ్గు గని కార్మి క సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు కొత్తగూడెం రీజీయన్ నుంచి సభకు భారీఎత్తున టీబీజీకేఎస్ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారు.
కార్మికుల పోరాటాలు చిరస్మరణీయం...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సింగరేణి కార్మికులు నిర్విరామంగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన నాన్చివేత ధోరణిని నిరసిస్తూ 2011 సెప్టెంబర్ 13వ తేదీన సింగరేణి వ్యాప్తంగా గని కార్మికు లు సకలజనుల సమ్మె చేపట్టారు. నాటి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సమ్మెలో పాల్గొన్న కార్మికులు ప్రతి రోజు వినూత్నరీతిలో ఆందోళనలు చేపట్టి తమ ఉద్యమ స్ఫూర్తిని నలుదిశలా చాటారు.
36 రోజుల పాటు విధులను బహిష్కరించి దక్షిణాది రాష్ట్రాల పరిశ్రమలు మూతబడే పరిస్థితిని తీసుకొచ్చి తీవ్ర సంక్షోభం సృష్టించారు. ఒక వైపు పోలీసుల కేసులు, అరెస్టులు, మరో వైపు యాజమాన్యం కోడ్‌ఆఫ్ డిసీప్లేన్ చట్టం తీసుకొచ్చినప్పటికీ కార్మికులు ఎక్కడా కూడా భయపడలేదు. కాగా, ఒక మస్టర్‌కు రెండు మస్టర్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా సమ్మెను సక్సెస్ చేసి తెలంగాణ పోరాట పటిమను చాటారు.
కార్మికులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సింగరేణి బొగ్గుగని కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి వారికి అండగా నిలిచారు. కాగా, ఈ ఇంక్రిమెంట్‌ను కార్మికులతో పాటుగా అధికారులకు కూడా వర్తింపజేయడం గమనార్హం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన పోరాటాలు చరిత్రపుటల్లో నిలిచిపోతాయి.