
సర్వేకు ప్రజలు సహకరించాలి
చిన్నసూరారం (తిప్పర్తి) :ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు తమ వివరాలు అందించి ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సంక్షేమ శాఖ) రాంలక్ష్మణ్ కోరారు. ఆదివారం మండలంలోని చిన్నసూరారం గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సర్వే రోజు ప్రజలంతా ఇంటి వద్దే ఉండి సర్వే బృందానికి సరైన వివరాలు అందించాలన్నారు. ప్రభుత్వ పరంగా అందించే పథకాలకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులతో ఒకే రోజు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సర్వే ద్వారా కుటుంబానికి ఒక నంబర్‌ను కేటాయించి వారి పూర్తి డాటాను అందులో పొందుపర్చనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలకోసం అసలైన లబ్ధిదారుల వివరాలు తెలుస్తాయన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15న భూ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, స్థానిక సర్పంచ్ నారగోని భద్రయ్యగౌడ్, మాజీ సర్పంచ్‌లు సంకు ధనలక్ష్మి, కట్టా యాదయ్య, బస్వయ్య తదితరులు ఉన్నారు.