
ఆ ఇద్దరికీ సంబంధం ఉందా..!
- నల్లగొండ జిల్లాకు చెందిన సతీశ్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసు
- ఉద్యోగాలిప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపణ
- బాధితుడిని విచారించిన ఇంటెలిజెన్స్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తనతో పాటు ఎనిమిది మందికి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ గత గురువారం సతీశ్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సీఎం పేషీలో ఉండే అజిత్‌రెడ్డి, గంగాధర్‌తోపాటు హాలియా మండలానికి చెందిన కృష్ణారెడ్డిలు తనను మోసం చేసినందునే ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగిందన్న దానిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ కేసులో ముఖ్యమంత్రి పేషీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం రాత్రి బాధితుడు సతీశ్‌రెడ్డిని అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అరగంటకు పైగా విచారించారు. ఈ కేసులో సీఎం పేషీకి చెందిన అజిత్‌రెడ్డి, గంగాధర్‌ల ప్రమేయం ఉందా? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అనే కోణాల్లో బాధితుడు సతీశ్‌రెడ్డిని ప్రశ్నించారు. జరిగిన విషయాన్నంతటినీ వివరించిన అనంతరం కొన్ని ఫొటోలను చూపించి అజిత్‌రెడ్డి, గంగాధర్‌ను గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగారని, తాను ఇద్దరినీ గుర్తుపట్టి చూపించానని సతీశ్‌రెడ్డి చెబుతుండట గమనార్హం.
ఈ కేసులో అజిత్‌రెడ్డి, గంగాధర్‌ను తప్పించేందుకు పోలీసు లపై ఒత్తిడి తెస్తున్నారని సతీశ్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. మంగళవారం అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కేసులో కృష్ణారెడ్డిని మాత్రమే బాధ్యులను చేసే దిశలో పోలీసులు వెళుతున్నట్లు తనకు అనుమానం వస్తోందన్నారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు.
పోలీసుల అదుపులో కృష్ణారెడ్డి?
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలియా మండలానికి చెందిన పల్‌రెడ్డి కృష్ణారెడ్డిని సోమవారం రాత్రి నల్లగొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసేందుకు ముందు రోజు డబ్బులు తీసుకున్న కృష్ణారెడ్డిని బాధితుడు సతీశ్‌రెడ్డి కలిశాడని, అప్పుడు కృష్ణారెడ్డి కూడా సతీశ్‌రెడ్డితో తన గోడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. తనను గంగాధర్ మోసం చేశాడని, ఈ విషయాన్ని అజిత్ దృష్టికి తీసుకెళితే అలా చేయడానికి వీల్లేదు.. కూర్చోబెట్టి మాట్లాడుదాం.. విషయాన్ని పెద్దది చేయకండి అని సర్ది చెప్పాడని కృష్ణారెడ్డి సతీశ్‌రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. కాగా, నల్లగొండ డీఎంహెచ్‌వో కార్యాలయ ఉద్యోగితో పాటు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డి, హైదరాబాద్‌కే చెందిన మరో భార్యాభర్తల నుంచి.. ఇలా చాలా మంది వద్ద నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడని కృష్ణారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి.