
మళ్లీ ఎండాకాలం!
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
► సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం
► ఎల్‌నినో పోయినా.. లానినా రాని పరిస్థితి
► వర్షాల్లేక విలవిల్లాడుతున్న రైతులు
► ఎండిపోయే దశకు చేరుకుంటున్న పంటలు
► వచ్చే నెలలో వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగత్ర 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గడిచిన 24 గంటల్లో 37 డిగ్రీలు నమోదైంది. ఏకంగా ఇక్కడ 6 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో కూడా సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పంటలకు భారీ నష్టం
రాష్ట్రంలో పది రోజులకు పైగా చుక్క వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కీలకమైన పూత, కాత దశలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వేసిన 13.90 లక్షల ఎకరాల మొక్కజొన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల అన్నింటి కన్నా కూడా మొక్క జొన్న పంటే భారీగా నష్టపోతుందని పేర్కొంటున్నారు. కాగా, 7.36 లక్షల ఎకరాల్లో వేసిన సోయాబీన్ ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఇప్పుడు ఈ పంటకు కూడా వర్షం చాలా అవసరం. నల్లరేగడి భూముల్లో పత్తి పంట వేస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకున్నా.. ఇంకో వారం రోజుల పాటు ఇలాగే ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 3.68 లక్షల ఎకరాల్లో వేసిన పెసర ఎండిపోయే దశకు చేరుకుం టోంది. మరోవైపు పశ్చిమబెంగాల్, గ్యాంగ్‌టక్ వైపు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంపై ఉంటుంది. కానీ సాధార ణం కన్నా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
లానినా జాడేదీ?
పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్‌నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఎండలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ అధిక వర్షాలకు కారణమయ్యే లానినా మాత్రం ఇంకా ఏర్పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో, లానినాల ప్రభావం లేదని రెండింటికి మధ్య తటస్థ స్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చే నెలలో లానినా ప్రభావం పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్, జూలై, ఆగస్టు నాటికి ఎల్‌నినో 16 శాతం నుంచి 6 శాతానికి పడిపోవాలి. లానినా 26 శాతం నుంచి 52 శాతానికి చేరుకోవాలి. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67 శాతానికి, ఎల్‌నినో 4 శాతానికి చేరుకోవాలి. అక్టోబర్ చివరకు లానినా ప్రభావం 71 శాతానికి పెరగాలి. అయితే ఎల్‌నినో ప్రభావం ముగిసినప్పటికీ అనుకున్న ప్రకారం లానినా మాత్రం ప్రవేశించలేదు.