నిజామాబాద్ క్రైం: తెలంగాణ, మహారాష్ట్రలలో దొంగతనాలు, దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొత్తం 9 మంది ముఠా సభ్యులలో పోలీసుల చేతికి ముగ్గురు చిక్కగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన దొంగల నుంచి బంగారు అభరణాలు, వెండి వస్తువులు, నగదు, చాకులు, ఓ కారు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం డీఐజీ గంగాధర్ , జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలలో తాళం వేసున్న ఇళ్లలో చోరీకి పాల్పడడంతో పాటు ఇతర ప్రాంతాలలో మారణాయుధాలు చూపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నగలు, డబ్బు లాక్కునేవారు. మొత్తం తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి ఇలా అరాచకాలు చేసేవారు. గురువారం ఉదయం రూరల్ పోలీసులు కంఠేశ్వర్ ప్రాంతం బైపాస్‌రోడ్డు, రైల్వేస్టేషన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా బైపాస్ వద్ద ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలుకా పాతా ఖానాపూర్‌కు చెందిన దండ్ల బాబు, అర్దాపూర్‌కు చెందిన లక్ష్మన్ పీరాజీ మిత్‌కర్, బీడ్ పట్టణం ధనోరాకు చెందిన జోగుదండి వికాస్ ఉన్నారు. వారి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ. 50 వేల నగదు, ఒక మారుతి కారు, మూడు బైక్‌లు, మూడు చాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై మొత్తం 19 కేసులు ఉన్నాయి.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Published Thu, Oct 8 2015 10:01 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement