
ఇంటర్ పరీక్షకు భారీగా గైర్హాజరు
ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర పరీక్షల మొదటిరోజు భారీ సంఖ్యలో విద్యార్థులు గైర్హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈసారి 75 శాతం హాజరు లేని విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇచ్చేందుకు నిరాకరించడమే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జనరల్, వొకేషనల్ అభ్యర్థులు 4,94,401 మంది పరీక్ష కోసం నమోదు చేసుకోగా తెలంగాణలోని 10 జిల్లాల్లోనే 37,138 మంది విద్యార్థులు హాజరుకాలేదు. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు మొదటి రోజు 65,814 మంది గైర్హాజరు కాగా, ఈసారి 10 జిల్లాల నుంచే 37,138 మంది గైర్హాజరు కావడం గమనార్హం.
ప్రైవేటు కాలేజీల్లోనే కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో కూడా 75 శాతం హాజరు లేని విద్యార్థులకు హాల్‌టికెట్లను నిరాకరించినట్లు తెలిసింది. ఇక జిల్లాల్లో సజావుగా పరీక్షలు జరిగాయి. కొన్ని చోట్ల వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల ఒకే కేంద్రాన్ని ఎక్కువ మంది విద్యార్థులకు కేటాయించడం వల్ల విద్యార్థులు పక్కపక్కనే కూర్చొని పరీక్షలు రాసినట్లు సమాచారం. ఉదయం 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించబోమన్న బోర్డు ఆదేశాల నేపథ్యంలో కొన్ని చోట్ల విద్యార్థులు హాజరు కాలేకపోయినట్లు సమాచారం. దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డుకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం 9 గంటల తరువాత 5 నిమిషాల వరకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేసి డీబార్ చేశారు.