నగరంలో అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌: జయేశ్‌ | International Black Chain Congress in the city | Sakshi
Sakshi News home page

నగరంలో అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌: జయేశ్‌

Published Fri, Jul 27 2018 1:01 AM | Last Updated on Fri, Jul 27 2018 1:01 AM

International Black Chain Congress in the city - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు నగరం వేదిక కానుంది. తొలి అంతర్జాతీ య బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌కు హైదరాబాద్‌  గోవాతో కలసి ఆతిథ్యం ఇవ్వనుంది. నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్రాల ప్రభుత్వాలు, న్యూక్లియస్‌ విజన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆగస్టు 3, 4 తేదీల్లో నగరంలోని హెచ్‌ఐసీసీ కాంప్లెక్స్‌లో, 5న గోవాలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ గురువారం ఇక్కడ వెల్లడించారు.

ఈ సదస్సుకు వచ్చే ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ల యజమానులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నా యని వార్తలొస్తున్నాయని, అదే సమయంలో బ్లాక్‌చైన్‌ లాంటి కొత్త టెక్నాలజీలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని జయేశ్‌ తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆరేడు విభాగాల్లో బ్లాక్‌చైన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ వినియోగాన్ని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.

భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్‌చైన్‌ పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరమన్నారు. బిట్‌ కాయిన్‌ అనే క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను అత్యంత సురక్షితంగా భద్రపరిచేందుకు ‘ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ ప్రూఫ్‌ లెడ్జర్‌’గా బ్లాక్‌చైన్‌ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూక్లియస్‌ విజన్‌ సీఈవో అభిషేక్‌ పిట్టి తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement