జోరుగా ‘ఐపీఎల్’ బెట్టింగ్ | IPL betting in MIRYALAGUDA | Sakshi
Sakshi News home page

జోరుగా ‘ఐపీఎల్’ బెట్టింగ్

Published Wed, Apr 27 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

IPL betting in MIRYALAGUDA

మిర్యాలగూడలో బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20-20 క్రికెట్ కప్‌పై కొనసాగిన బెట్టింగ్‌లు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్‌పై సాగుతున్నాయి.గతంలో కంటే బెట్టింగ్ జోరందుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్‌పై యువత జోరుగా బెట్టింగ్‌కు సాగిస్తున్నారు. యువరాజ్, ధోని, రోహిత్‌శర్మ.. ఇలా క్రికెటర్‌లపై వ్యక్తిగతంగా బెట్టింగ్ కడుతున్నారు. గతంలో ఆట మొత్తానికి బెట్టింగ్ నిర్వహించిన వారు ప్రస్తుతం క్రికెటర్ నైపుణ్యంపై బెట్టింగ్ సాగిస్తున్నారు.
 
  ప్రతి రోజు సాగుతున్న ఈ ఆటపై సాయంత్రం అయ్యిందంటే బెట్టింగ్‌లకు బేరాలు సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని పలు చోట్ల యువత కూర్చొని క్రికెట్ ఆటను పరిశీలిస్తూ ఫోన్‌ల ద్వారానే బెట్టింగ్‌లు సాగిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహకులు మిర్యాలగూడతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండి సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో బెట్టింగ్‌లు నిర్వహంచడానికి ఉన్న బుకీలకు మిర్యాలగూడలో ఉన్న ఏజెంట్లు స్థానికుల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా స్థానికులకు ఫోన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అందుబాటులో ఉంటున్నారు.
 
 వేలాది రూపాయలు పొగొట్టుకుంటున్న యువత
 క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల యువత వేలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రూ.వెయ్యికి రెండు, మూడు వేల రూపాయలు ఇస్తామని చెబుతున్న బుకీలు ఆకర్షించి వేలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం వల్ల కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సైతం బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు లేక ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోయిన విషయం విధితమే. కాగా ఇలాంటి బెట్టింగ్‌లతో యువత భారీగా నష్టపోతోంది.
 
 మందలించడంతోనే సరి..
 బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సమాచారం పోలీసులకు తెలిస్తే ఇక్కడికి వెళ్లి వారిని మందలించి వదిలేస్తున్నట్లు సమాచారం. దామరచర్ల మండలం వాడపల్లిలో ఇటీవల ముగ్గురు వ్యక్తులను క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు మందలించి వదిలేసినట్లు తెలిసింది. బెట్టింగ్‌ల గురించి పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల జోరు కొనసాగుతోంది. పోలీసులు మందలించినా యథావిథిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement