లాహిరి లాహిరి లాహిరిలో..  | IRCTC cruise tourism | Sakshi
Sakshi News home page

లాహిరి లాహిరి లాహిరిలో.. 

Published Sun, Feb 3 2019 2:25 AM | Last Updated on Sun, Feb 3 2019 1:27 PM

IRCTC cruise tourism - Sakshi

ఇప్పటి వరకు విమాన సర్వీసులు, రైలు, రోడ్డు మార్గాల్లో పర్యాటకులకు జాతీయ, అంతర్జాతీయ టూర్‌ ప్యాకేజీలను అందిస్తోన్న ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తొలిసారి క్రూయిజ్‌ టూర్‌కు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన నౌకలో సముద్రయానం. భోజనం, వసతి, స్విమ్మింగ్‌పూల్, బార్, రెస్టారెంట్‌ వంటి సదుపాయాలతో విదేశాలను చుట్టివచ్చే అద్భుత అవకాశాన్ని కల్పించింది. పర్యాటక ప్రియుల మదిని దోచేలా రూపొందించిన ఈ టూర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని కోసం ఇప్పటి నుంచే బుకింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. మొత్తం 12 రాత్రులు, 13 ఉదయాల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌ నుంచి ‘నార్వేజియన్‌ గేట్‌వే’నౌకలో బయలుదేరి వివిధ దేశాల్లో పర్యటిస్తూ తిరిగి కోపెన్‌హాగెన్‌కు చేరుకుంటారు. ఇందుకోసం నగరవాసులు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విమానంలో దుబాయ్‌ మీదుగా కోపెన్‌హాగెన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ మొత్తం ఏర్పాట్లు చేస్తోంది. కోపెన్‌హాగెన్‌ నుంచి బయలుదేరి వెళ్లే క్రమంలో వచ్చే వివిధ దేశాలను సందర్శిస్తారు. ఆయా నగరాల్లో సైట్‌సీయింగ్‌ ఉంటుంది. కోపెన్‌హాగెన్‌ నుంచి బయలుదేరే నార్వేజియన్‌ గేట్‌వే జర్మనీ, పోలండ్, ఫిన్‌లాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్‌ల మీదుగా తిరిగి కోపెన్‌హాగెన్‌ చేరుకుంటుంది. జూన్‌ 24 నుంచి జూలై 7 వరకు కొనసాగే ఈ పర్యటన కోసం ఐఆర్‌సీటీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  
 – సాక్షి, హైదరాబాద్‌

పర్యటన ఇలా.. 
నార్వేజియన్‌ గేట్‌వే క్రూయిజ్‌ టూర్‌ ప్యాకేజీలోనే విమాన ప్రయాణం కూడా ఉంటుంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (ఈకే 513)లో 24వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్‌ చేరుకుంటారు. అదేరోజు అక్కడి నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్‌ (ఈకే 151)లో బయలుదేరి మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో కోపెన్‌హాగెన్‌ చేరుకుంటారు. పర్యటన అనంతరం జూలై 5న (ఈకే 152) కోపెన్‌హాగెన్‌ నుంచి రాత్రికి దుబాయ్‌కి చేరుకొని అక్కడి నుంచి (ఈకే 510) జూలై 6 తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రయాణం ఉంటుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఐఆర్‌సీటీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే ఢిల్లీలో హోటల్‌లో ఉచిత బస సదుపాయం కూడా కల్పిస్తారు.  

ధరల వివరాలు.. 
ఫిబ్రవరి 28 వరకు బుకింగ్‌ చేసుకొనే వారికి ఒక్కరికి రూ. 4,83,630 చొప్పున, ఇద్దరికి కలిపి బుక్‌ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,95,817 చొప్పున నార్వేజియన్‌ గేట్‌వే క్రూయిజ్‌ ప్యాకేజీ ఉంటుంది. ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,63,634 చొప్పున ఉంటుంది. పిల్లలకు రూ. 2,43,516 చొప్పున చార్జీలు విధించారు. ఈ పర్యటనలో భాగంగా జూన్‌ 25న ఉదయం 5 గంటలకు కోపెన్‌హాగెన్‌ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బెర్లిన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రోజు వరుసగా పోలండ్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్, స్వీడన్‌ దేశాల్లో పర్యటించి జూలై 4న తిరిగి కోపెన్‌హాగెన్‌ చేరుకుంటారు. 

స్విమ్మింగ్‌పూల్,రెస్టారెంట్, బార్‌.. 
నార్వేజియన్‌ గేట్‌వే నౌకలో మొత్తం 30 బాల్కనీలు ఉంటాయి. సువిశాలమైన సముద్రాన్ని వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. రెండు డైనింగ్‌ హాళ్లు, ఔట్‌డోర్‌ బఫెట్, స్విమ్మింగ్‌ పూల్, బార్, రెస్టారెంట్, కాఫీబార్, ఫిట్‌నెస్‌ సదుపాయం వంటివి ఉంటాయి. స్విమ్మింగ్‌ పూల్స్‌లో హాట్‌ టబ్స్‌ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్, వైఫై, స్పా, సెలూన్‌ సర్వీసులు, క్యాషినో, డైనింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. నచ్చిన సినిమాలు చూసే సౌకర్యం కూడా ఉంది. నౌకలోంచి ఆయా దేశాల్లోకి ప్రవేశించినప్పుడు రోడ్డు మార్గాల్లో సిటీ టూర్‌ ఏర్పాటు చేస్తారు. తిరిగి రాత్రికి నార్వేజియన్‌ గేట్‌వేకు చేరుకొని బస చేసేవిధంగా ఈ పర్యటనను రూపొందించినట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement