Emirates Airlines
-
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
విమానం రద్దు.. ఎయిర్‌లైన్స్‌కు జరిమానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయటం వంటి కారణాలతో... ఎమిరేట్స్ విమానాయాన సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరం రూ.2 లక్షల జరిమానా విధించింది. రద్దు చేసిన విమాన టికెట్ చార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వినయ్ కుమార్ సిన్హా (57), కృష్ణ సిన్హా (55) దంపతులు టికెట్లు బుక్ చేసి... 2017 జులై 12న డెట్రాయిట్‌లోని బంధు వులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా... బోస్టన్ నుంచి డెట్రాయిట్కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది. నిర్ధారిత సమయంలో డెట్రాయిట్కు చేరుకోవటంలో విఫలమైనందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినందుకు వీరిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది. -
నా విమాన ప్రయాణాన్ని అడ్డుకున్నారు: గేల్
ఆంటిగ్వా: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ఒక ఎయిర్‌లైన్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన విమాన ప్రయాణంలో భాగంగా టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ అనుమతించకపోవడాన్ని గేల్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘ నేను విమాన టికెట్‌ను బుక్ చేసుకున్నా. అది కన్ఫర్మ్ అయ్యింది. కానీ నన్ను విమానంలో ప్రయాణించడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అనుమతించలేదు. ఓవర్ బుకింగ్ అయ్యిందంటూ సాకులు చెప్పారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది నా జీవితంలో చేదు అనుభవం’ అని గేల్ పేర్కొన్నాడు. బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న తనను ఎకానమీ క్లాస్ ప్రయాణించేలా చూశారన్నాడు. దాన్ని తిరస్కరించి తదుపరి విమానంలో ప్రయాణించానని గేల్ ట్వీటర్లో పేర్కొన్నాడు. కాకపోతే ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో గేల్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యిందనే విషయం మాత్రం చెప్పలేదు. ఇటీవల భారత్‌తో ఆగస్టులో జరిగిన మ్యాచ్‌లో విండీస్ తరఫున కనిపించిన గేల్.. 42 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన సెంచరీ చేయడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. So disappointed @emirates, I have a confirmed flight and they gonna tell me that they are over booked, WTF! Not only that, @emirates want me to travel economy when it’s a business class ticket - so now I have to travel on a later flight! Just ridiculous @emirates!Bad experience😡 — Chris Gayle (@henrygayle) November 4, 2019 -
లాహిరి లాహిరి లాహిరిలో..
ఇప్పటి వరకు విమాన సర్వీసులు, రైలు, రోడ్డు మార్గాల్లో పర్యాటకులకు జాతీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తోన్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తొలిసారి క్రూయిజ్ టూర్‌కు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన నౌకలో సముద్రయానం. భోజనం, వసతి, స్విమ్మింగ్‌పూల్, బార్, రెస్టారెంట్ వంటి సదుపాయాలతో విదేశాలను చుట్టివచ్చే అద్భుత అవకాశాన్ని కల్పించింది. పర్యాటక ప్రియుల మదిని దోచేలా రూపొందించిన ఈ టూర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని కోసం ఇప్పటి నుంచే బుకింగ్ సదుపాయాన్ని కల్పించారు. మొత్తం 12 రాత్రులు, 13 ఉదయాల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ నుంచి ‘నార్వేజియన్ గేట్‌వే’నౌకలో బయలుదేరి వివిధ దేశాల్లో పర్యటిస్తూ తిరిగి కోపెన్‌హాగెన్‌కు చేరుకుంటారు. ఇందుకోసం నగరవాసులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విమానంలో దుబాయ్ మీదుగా కోపెన్‌హాగెన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ మొత్తం ఏర్పాట్లు చేస్తోంది. కోపెన్‌హాగెన్ నుంచి బయలుదేరి వెళ్లే క్రమంలో వచ్చే వివిధ దేశాలను సందర్శిస్తారు. ఆయా నగరాల్లో సైట్‌సీయింగ్ ఉంటుంది. కోపెన్‌హాగెన్ నుంచి బయలుదేరే నార్వేజియన్ గేట్‌వే జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్ల మీదుగా తిరిగి కోపెన్‌హాగెన్ చేరుకుంటుంది. జూన్ 24 నుంచి జూలై 7 వరకు కొనసాగే ఈ పర్యటన కోసం ఐఆర్సీటీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – సాక్షి, హైదరాబాద్ పర్యటన ఇలా.. నార్వేజియన్ గేట్‌వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీలోనే విమాన ప్రయాణం కూడా ఉంటుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం (ఈకే 513)లో 24వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్ చేరుకుంటారు. అదేరోజు అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ (ఈకే 151)లో బయలుదేరి మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో కోపెన్‌హాగెన్ చేరుకుంటారు. పర్యటన అనంతరం జూలై 5న (ఈకే 152) కోపెన్‌హాగెన్ నుంచి రాత్రికి దుబాయ్‌కి చేరుకొని అక్కడి నుంచి (ఈకే 510) జూలై 6 తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం ఉంటుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఐఆర్సీటీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే ఢిల్లీలో హోటల్లో ఉచిత బస సదుపాయం కూడా కల్పిస్తారు. ధరల వివరాలు.. ఫిబ్రవరి 28 వరకు బుకింగ్ చేసుకొనే వారికి ఒక్కరికి రూ. 4,83,630 చొప్పున, ఇద్దరికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,95,817 చొప్పున నార్వేజియన్ గేట్‌వే క్రూయిజ్ ప్యాకేజీ ఉంటుంది. ముగ్గురికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,63,634 చొప్పున ఉంటుంది. పిల్లలకు రూ. 2,43,516 చొప్పున చార్జీలు విధించారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 25న ఉదయం 5 గంటలకు కోపెన్‌హాగెన్ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బెర్లిన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోజు వరుసగా పోలండ్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్, స్వీడన్ దేశాల్లో పర్యటించి జూలై 4న తిరిగి కోపెన్‌హాగెన్ చేరుకుంటారు. స్విమ్మింగ్‌పూల్,రెస్టారెంట్, బార్.. నార్వేజియన్ గేట్‌వే నౌకలో మొత్తం 30 బాల్కనీలు ఉంటాయి. సువిశాలమైన సముద్రాన్ని వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. రెండు డైనింగ్ హాళ్లు, ఔట్‌డోర్ బఫెట్, స్విమ్మింగ్ పూల్, బార్, రెస్టారెంట్, కాఫీబార్, ఫిట్నెస్ సదుపాయం వంటివి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్‌లో హాట్ టబ్స్ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్, వైఫై, స్పా, సెలూన్ సర్వీసులు, క్యాషినో, డైనింగ్ ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. నచ్చిన సినిమాలు చూసే సౌకర్యం కూడా ఉంది. నౌకలోంచి ఆయా దేశాల్లోకి ప్రవేశించినప్పుడు రోడ్డు మార్గాల్లో సిటీ టూర్ ఏర్పాటు చేస్తారు. తిరిగి రాత్రికి నార్వేజియన్ గేట్‌వేకు చేరుకొని బస చేసేవిధంగా ఈ పర్యటనను రూపొందించినట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. -
హిందూ మీల్స్‌పై వెనక్కి తగ్గిన ఎమిరేట్స్
న్యూఢిల్లీ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవడంతో, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. ఫుడ్ ఆప్షన్స్ నుంచి హిందూ మీల్స్‌ను వెనక్కి తీసుకోవాలని, భారతీయుల మతసంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాంకాహారం, మాంసాహారం ఆఫర్ చేయనున్నట్టు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని, హిందూ మీల్ ఆప్షన్‌ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ ధృవీకరించింది. దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని, వారి అభ్యర్థనమేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది. ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని, వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది. ప్రయాణికులకు తాము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. తాము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటామని, ఇది తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని ఎమిరేట్స్ తెలిపింది. పెద్ద పెద్ద విమానయాన సంస్థలన్నీ మతపరమైన అంశాలను, ఆహార నియమాలు, వైద్య అంశాలను పరిగణలోకి తీసుకుని మీల్ ఆప్షన్లను అందిస్తూ ఉంటాయి. ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మెనూలలో ‘రిలీజియస్’ పేరు మీద స్పెషల్ మీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో హిందూ నాన్-వెజిటేరియన్ మీల్, ముస్లి, మస్సెలెం మీల్, కోషర్ మీల్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెజిటేరియన్ మీల్ కోసం కూడా పలు ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ వెజ్, జైన్ మీల్, ఓరియెంటల్, వెగాన్ వంటి మీల్స్‌ను ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు అందిస్తూ ఉంటాయి. -
ఇక విమానాల్లో హిందూ భోజనం కట్
దుబాయ్ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించింది. బుధవారం విమానయాన సంస్థ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రయాణికులకు మేము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తాం. మేము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఇది మా సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానిలో భాగంగానే ఆన్ బోర్డ్ ప్రొడక్ట్స్, సేవల విషయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఎమిరేట్స్ మెనూలోంచి హిందూ మీల్స్‌ను తొలగించాం’ అని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. అంతేకాక ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని తెలిపారు. ఇక మీదట హిందూ ప్రయాణికులు, శాఖాహార ప్రయాణికులు శాఖాహార జైన్ ఆహారం, భారతీయ శాఖాహార భోజనం, కోశర్ భోజనం, నాన్ బీఫ్ నాన్ వెజిటేరియన్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
భర్త పాస్‌పోర్ట్‌తో భార్య ఏం చేసిందంటే.. !
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అందులో సరిదిద్దుకొనేవి కొన్ని, సరిదిద్దుకోలేనివి ఇంకొన్ని. కానీ భారత్‌కు చెందిన ఓమహిళ చేసిన పొరపాటు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. అదేంటంటే భర్త పాస్‌పోర్ట్‌తో ఏకంగా దేశాలు దాటేసింది. గీతా మోధ అనే భారతీయ మహిళ మాంచెస్టర్‌లో అలంకార్ వస్త్ర దుకాణం నడుపుతోంది. గత ఏప్రిల్ 23న బిజినెస్ పనిమీద ఢిల్లీ రావాల్సి వచ్చింది. అయితే తొందరపాటులో తన పాస్‌పోర్ట్ బదులు భర్త దిలీప్ పాస్‌పోర్ట్‌ను తీసుకొని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో వయా దుబాయ్ మీదుగా ఢిల్లీ బయలుదేరింది. అయితే విదేశాల నుంచి వచ్చే భారతీయులు ఇమిగ్రేషన్ పూర్తి అయితేనే భారత్‌లోకి రావడానికి అనుమతి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు గీత ఇమిగ్రేషన్ తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ వర్గాలను సంప్రదించగా ఈ సంఘటనపై విచారణం చేపట్టామని పేర్కొన్నారు. -
ఇంతవరకూ చూడని విమానం..!
దుబాయ్ : గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కొత్త బోయింగ్ విమానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇది సాధారణ విమానం కాదు. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి విమానం లేదు. దానిపై కప్పు మొత్తం గాజుతో చేసిందట. సాధారణంగా ఏ విమానంలో అయిన చిన్న కిటికిలోంచి మాత్రమే బయటికి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బోయింగ్ 777ఎక్స్‌లో ప్రయాణిస్తూ అందమైన ఆకాశం, విమానాన్ని ఢీ కొడుతున్నట్లు కనిపించే మబ్బులను వీక్షించవచ్చంటూ ఎమిరేట్స్ సంస్థ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఆ విమానానికి సంబంధించిన ఫోటోలను ఫోస్ట్ చేసింది. ఈ విమానాలను 2020 కల్లా అందుబాటులోకి తెస్తున్నట్టు కూడా సంస్థ వెల్లడించింది. ఫోటోలు చూసి, వివరాలు చదివిన జనాలు ఇక ఎంచక్క ఆ విమానంలో ఎగిరి ఆకాశపు అందాలను చూద్దాం అంటూ కలలు కన్న వారిని నిద్ర లేపినట్టు ఈ రోజు ఏప్రిల్ ఒకటి అంటే ‘ఫూల్స్ డే’ అంటూ అందర్ని ఫూల్స్‌ని చేసేసింది. గతేడాది కూడా ఈ సంస్థ ఇలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం తెస్తున్నామని ప్రకటించింది. దాని పేరును ఏపీఆర్001 గా చెప్పి అందులో స్విమ్మింగ్ పూల్, ఆటల గది, పార్కు, జిమ్ ఉంటాయంటూ అందర్ని ఫూల్స్ చేసింది. Emirates reveals SkyLounge, the most exclusive Onboard Lounge to be introduced on its Boeing 777X fleet from 2020. A completely transparent lounge with unmatched aerial views and unparalleled luxury, Emirates SkyLounge promises window views like no other. A post shared by Emirates (@emirates) on Mar 31, 2018 at 1:24pm PDT -
విమానంలో ప్రయాణికుడు మృతి
శంషాబాద్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అస్వస్థతతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే372 విమానం దుబాయి నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. మార్గంమధ్యలో సూడాన్‌కు చెందిన మహ్మద్ అలీ(55) అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం అతన్ని విమానాశ్రయ ప్రాంగ ణంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అలీ విమానంలోనే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. సుమారు మూడు గంటల తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. -
ఎమిరేట్స్ ప్రయాణికులకు రూ.4.7 లక్షలు
దుబాయ్: ఇటీవలి ఎమిరేట్స్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న 282 ప్రయాణికులు.. ఒక్కొక్కరు 7 వేల డాలర్లు (4,70,000) చొప్పున పరిహారంగా అందుకోనున్నారు. ఈ విషయాన్ని విమానయాన సంస్థ తెలిపింది. వీరిలో అత్యధికులు కేరళవాసులే. ఈ విమానంలోనే తన భార్య ఇద్దరు పిల్లలతో ప్రయాణించిన వ్యక్తికి ఎమిరేట్స్ సంస్థ ఈమెయిల్ సందేశం పంపింది. ‘మంగళవారం సాయంత్రమే మెయిల్ వచ్చింది. అయితే నేను ఆలస్యంగా గమనించా’ అని అతను స్థానిక వార్తాపత్రికకు వెల్లడించారు. ఆగస్టు 3న తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరిన విమానం ల్యాండింగ్ సమయంలో నేలను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందిని సురక్షితంగా రక్షించిన విషయం తెలిసిందే. -
నిర్లక్ష్యానికి రూ.55 వేల జరిమానా
చెన్నై: ప్రయాణికుడి వస్తువుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల ఫోరం రూ. 55 వేల జరిమానా విధించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని మనోవేదనకు గురిచేసినందుకు ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తమిళనాడుకు చెందిన అశోక్ బాలసుబ్రమణియన్- కమర్షియల్ పైలట్ కోర్సు చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లాడు. 2008, ఆగస్టు 3న జోహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నైకు వస్తూ కనెక్టింగ్ విమానం ఎక్కాడు. చెన్నైకు వచ్చిన తర్వాత తన లగేజీ పోయినట్టు గుర్తించిన అశోక్- ఎమిరేట్ ఎయిర్ లైన్స్ ను సంప్రదించాడు. లగేజీ పోయిందని, దీనికి పరిహారంగా 200 డాలర్లు ఇస్తామని ఈ ఏడాది ఆగస్టు 28న అశోక్ కు ఎయిర్ లైన్స్ లేఖ రాసింది. దీంతో అతడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఎమిరేట్స్ నిర్లక్ష్యంతో తన కెరీర్ కు నష్టం జరిగిందని, పైలట్ లైసెన్స్, సర్టిఫికెట్లతో పాటు కీలక పత్రాలు పోయాయని వాపోయాడు. తనకు పరిహారంగా రూ.50 లక్షలు ఇప్పించాలని కోరారు. అయితే ముఖ్యమైన పత్రాలు తమ దగ్గరే ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించామని ఎమిరేట్స్ వాదించింది. ఇలాంటి వాదనలతో నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోలేరని ఎమిరేట్స్ కు ఫోరం మొట్టికాయ వేసింది. రూ.55 వేలు పరిహారం జరిమానా చెల్లించాలని ఆదేశించింది. -
చిన్న ఎలుక.. విమానాన్నే ఆపేసింది!
ఒక చిన్న ఎలుక.. విమానం మొత్తాన్ని ఆపేసింది. బర్మింగ్‌హామ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఒక రోజు మొత్తం రద్దుచేసి పారేశారు. విమానంలో ఎలుక దూరిన విషయం తెలిసినా, దాన్ని పట్టుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ప్రయాణికులందరినీ దింపేసి, వాళ్లకు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి విమానం రద్దుచేశారు. కేబిన్ సిబ్బంది ఎలుకను పట్టుకోడానికి చాలా ప్రయత్నించారు గానీ, వాళ్ల వల్ల కాలేదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. విమానంలో ఎలుక ఉన్న విషయం తెలిసి, అది తమ కాళ్ల వద్దకు ఎక్కడ వస్తుందోనని ప్రయాణికులంతా చాలాసేపు భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఇది అసలైన వీడియో కాదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అంటోంది. -
ఎమిరేట్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ బోయింగ్ విమానం శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించివేశాడు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు. విమానం బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ వెళుతోంది. కాగా గురువారం కూడా దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అత్యవసరంగా కిందికు దిగిన విషయం తెలిసిందే. -
ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ : దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు విమానంలోని సిబ్బందికి తెలియజేశాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించి ... ప్రయాణికుడి పరిస్థితిని వివరించారు. ఎయిర్పోర్ట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో అప్పటికే సిద్దంగా ఉన్న అంబులెన్స్‌లో ప్రయాణికుడిని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం విమానం సింగపూర్ బయలుదేరింది. -
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో అపోలో హాస్పిటల్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ తాజాగా దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద భారత్‌లో ఉన్న అపోలో హాస్పిటల్స్‌కి చికిత్స కోసం మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే పేషంట్లు, వారి సహాయకులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్.. విమాన చార్జీలపై ప్రత్యేక డిస్కౌంటు ఇస్తుంది. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరులో ఉన్న అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందేందుకు వచ్చే మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని 19 దేశాల వారికి ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద రిటర్న్ టికెట్లపై బిజినెస్ తరగతి ప్రయాణికులకు ఆరు శాతం మేర, ఎకానమీ తరగతిలో ప్రయాణించే వారికి నాలుగు శాతం దాకా చార్జీలు ఆదా కాగలవని సంస్థలు పేర్కొన్నాయి. అలాగే, భారత్‌లోని నిర్దిష్ట ప్రాంతాలకి సంబంధించి చేసుకునే బిజినెస్ క్లాస్ బుకింగ్స్‌పై 10 శాతం దాకా, ఎకానమీ క్లాస్ బుకింగ్స్‌పై అయిదు శాతం దాకా ఆదా కానుంది. ఇథియోపియా, ఘనా తదితర ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికీ మెరుగైన వైద్య సేవలు లభించడం కష్టమేనని, దీంతో ఆయా దేశాల వారికి కూడా అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తాము ఈ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అపోలో హాస్పిటల్స్ సీఈవో కె. హరిప్రసాద్ తెలిపారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు ప్రయాణించే అపోలో హాస్పిటల్స్ కస్టమర్లందరూ కూడా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారు ఎమిరేట్స్ వెబ్సైట్లో ఉండే పాస్‌కోడ్‌ను ఉపయోగించి ప్రత్యేక డిస్కౌంటును పొందవచ్చు. -
పూతేసుకొచ్చినా.. పట్టేసుకున్నారు!
మెరిసేదంతా బంగారం కాదంటారు. అలాగే, మెరవనిదంతా బంగారం కాదని కూడా అనుకోనక్కర్లేదు. ఎందుకంటే, బంగారం గొలుసులకు అల్యూమినియం పూత పూసి, అది పుత్తడి కాదు.. ఉత్తదే అని చూపించడానికి ప్రయత్నించాడో ఘనుడు. కానీ, కస్టమ్స్ అధికారులు ఊరుకుంటారా, పుటుక్కున అతగాడిని పట్టేసుకున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. షూ సాక్సులు.. లో దుస్తుల్లో ఇప్పటి వరకు బంగారాన్ని తీసుకొచ్చేవారు. తాజాగా ఓ కేరళవాసి బంగారు గొలుసుకు అల్యూమినియం పూతపూసుకుని వచ్చి కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే యత్నంచేసి విఫలమయ్యాడు. అతడి నుంచి అధికారులు సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కేరళ రాష్ట్రం కాసర్‌ఘడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 524 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నాడు. తనిఖీల్లో అతడి ట్రాలీ బ్యాగుకు డిజైన్‌గా తెల్లటి తీగలు కనిపించాయి. దీంతో అనుమానించిన అధికారులు.. అల్యూమినియంతో ఉన్న తీగలను బయటకు తీసి పైపూత తొలగించారు. దీంతో 400 గ్రాముల గొలుసులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆదివారం రాత్రి 1:30 గంటలకు హైదరాబాద్‌వాసి ఇసాహషీమ్ టైగర్ ఎయిర్‌లైన్స్ విమానం టీఆర్ 2624లో థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చాడు. 221 గ్రాముల బరువు, సుమారు రూ.6.63 లక్షల విలువచేసే బంగారుగొలుసు అతడు ధరించాడు. దానికి రశీదులు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -న్యూస్‌లైన్, శంషాబాద్