
చిన్న ఎలుక.. విమానాన్నే ఆపేసింది!
ఒక చిన్న ఎలుక.. విమానం మొత్తాన్ని ఆపేసింది. బర్మింగ్హామ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఒక రోజు మొత్తం రద్దుచేసి పారేశారు. విమానంలో ఎలుక దూరిన విషయం తెలిసినా, దాన్ని పట్టుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ప్రయాణికులందరినీ దింపేసి, వాళ్లకు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి విమానం రద్దుచేశారు.
కేబిన్ సిబ్బంది ఎలుకను పట్టుకోడానికి చాలా ప్రయత్నించారు గానీ, వాళ్ల వల్ల కాలేదని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. విమానంలో ఎలుక ఉన్న విషయం తెలిసి, అది తమ కాళ్ల వద్దకు ఎక్కడ వస్తుందోనని ప్రయాణికులంతా చాలాసేపు భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఇది అసలైన వీడియో కాదని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అంటోంది.