డాక్టర్.బాణోతు చంద్రావతి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ జిల్లా నాయకత్వంపై వైరా ఎమ్మెల్యే డాక్టర్.బాణోతు చంద్రావతి లేఖాస్త్రాన్ని సంధించారు. పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరు, జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తన వ్యక్తిగత పనితీరు, గిరిజన ప్రజాప్రతినిధుల పట్ల కమ్యూనిస్టు పార్టీ వైఖరి తదితర అంశాలపై ఆమె మూడు పేజీల లేఖను గురువారం పత్రికలకు విడుదల చేశారు. తన స్వదస్తూరితో రాసిన ఈ లేఖలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. తాను ఎన్నికలలో ఎలా పోటీ చేశాననే అంశం నుంచి పార్టీలో, నియోజకవర్గంలో జరిగిన అన్ని పరిణామాలను అందులో వివరించారు.
ముఖ్యంగా తనను ఏకాకిని చేసి జిల్లా పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు తప్ప... తానెలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీలో గిరిజన ప్రజాప్రతినిధులకు విలువ లేదని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి పార్టీని నాశనం చేస్తున్న వారికే ప్రాధాన్యమిస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ అవసరం కోసం మొదటిసారి తమ కుటుంబాన్ని సంప్రదించి పోటీచేయమని చెప్పిన వారు రెండోసారి కనీసం పోటీచేస్తావా అని తనను ఎందుకు అడగలేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలు సృష్టించి గిరిజనులను గెంటేసే ప్రయత్నం పార్టీలో జరుగుతోందని ఆమె ఘాటుగానే విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో గిరిజన వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి అంశంపై జిల్లాలో తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. వైరా ఎమ్మెల్యే చంద్రావతి సీపీఐకి గుడ్‌బై చెప్పబోతున్నారని, ఆమె ఇతర పార్టీలో చేరబోతున్నారని పత్రికల్లో వార్తలు రావడం.... అందుకు స్పందించిన సీపీఐ నాయకత్వం ఆమెపై ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం ఏ మలుపు తిరిగి ఎక్కడి మజిలీలను చేరుకుంటుందో వేచి చూడాల్సిందే....!
చంద్రావతి పత్రికలకు విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలు
‘నేను సీపీఐలోనే ఉన్నాను. నాకు వేరే అభిప్రాయం లేదు. పార్టీ అంటే గౌరవం, అభిమానం ఎప్పటికీ ఉంటాయి. పార్టీ అవసరం కొద్దీ 2009లో మా కుటుంబాన్ని సంప్రదించి నన్ను వైరా నుంచి పోటీచేయమని అడిగారు. మాకై మేము టికెట్ అడగలేదు. చిన్నవయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరి సహకారంతో గెలిచాను. పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. మేమున్నాం.. అన్నీ చూసుకుంటామని చెప్పిన వారు ఈరోజున పరిస్థితులకు నన్ను బాధ్యురాలిని చేయడం ఎంత వరకు సమంజసం? వైరాలో పార్టీ అంత బలంగా లేదనేది వాస్తవం.
నిర్మాణ పద్ధతులు నేర్చుకుంటూ పనిచేసే ప్రయత్నం చేశాను. దీనికి జిల్లా పార్టీ సహకారం లభించలేదు. కొందరు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చాలాసార్లు అగ్రనాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కానీ ఫలితం లేకపోయింది. స్వార్థంతో పనిచేస్తున్న వారిని నియంత్రించలేకపోయారు. పెంచిపోషించారు. అయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాను. శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. నేను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడంలో పార్టీ నుంచి నాకు సహకారం లభించలేదు. అసెంబ్లీలో కూడా నా వాణిని పార్టీ సూచనల ప్రకారం వినిపించాను. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా మొదటిసారి ఎన్నికై మంచి పేరు సంపాదించాను. నా పనితీరును సీపీఐతో పాటు ఇతర పార్టీల వారు అభినందించారు. పదవి ఉపయోగించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా పార్టీ కారణంగా నష్టపోయాను. ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించి అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేశాను.
మళ్లీ పోటీ చేస్తారా లేదా అని నన్ను అడగలేదు. నా అభిప్రాయాన్ని తీసుకోలేదు. నాతో పార్టీ బాధ్యులు చర్చించి నాకు సూచనలు ఇవ్వడం కానీ, పరిస్థితిని వివరించే ప్రయత్నం కానీ చేయలేదు. అకస్మాత్తుగా మార్చి 7వ తేదీన జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో నన్ను మార్చే ఆలోచనను చెప్పారే కానీ ఖచ్చితంగా మారుస్తామని చెప్పడం లేదా వేరే పేర్లను ప్రకటించడం గాని చేయలేదు. నిర్ణయాన్ని జిల్లా ముఖ్యులకు వదిలేశామని చెప్పారు. ఈ ప్రక్రియ నన్ను బాధించింది. మనస్తాపం చెందాను. పార్టీ వారు ఎవరూ కనీసం నన్ను పట్టించుకోలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి..., నన్ను సంప్రదించి, నా ఆలోచన తెలుసుకోకుండా ఆరోపణలకు దిగడం ఎంతవరకు సబబు? గిరిజన మహిళనైన నన్ను ఈ విధంగా బాధ పెట్టడం తగదు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వల్ల ఈ సమస్య వచ్చింది.
గ్రూపు రాజకీయాలు చేసే వారిని నమ్మి సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తులకు ప్రముఖ స్థానం కల్పిస్తూ, వారి మాటలకు విలువిచ్చి నాపై ఆరోపణలు చేయడం తగదు. గిరిజన మహిళనైన నన్ను ప్రోత్సహించాల్సింది పోయి సహకరించకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులకు ఏ గతి పడుతుందో అందరికీ తెలుసు. సమస్యలను సృష్టించి గెంటేస్తున్నారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. గిరిజన ప్రాంతాల్లో కూడా పార్టీ ముఖ్య బాధ్యతల్లో గిరిజనులకు అంత ప్రాధాన్యత ఉండడం లేదు. ఏకాకి ని చేసి ఏకపక్ష నిర్ణయాలను అమలుపర్చడానికి ప్రయత్నం చేశారే కానీ ఏ విషయంలోనూ నన్ను కలుపుకుని పోలేదు. కానీ, నేను ఏమీ బాధపడకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశాను.
నిధుల కేటాయింపు పార్టీ ఇష్టానుసారమే జరిగింది. నా శక్తివంచన లేకుండా ఒక ఎమ్మెల్యేగా, మహిళగా ఎంతవరకు చేయగలనో చేసి సఫలీకృతమయ్యాను. ఐదుసంవత్సరాలల్లో ఒకేసారి ఎవరూ నియోజకవర్గ రూపురేఖలు మార్చలేరు. అభివృద్ధి ఎలా చేయాలో సూచనలు ఇవ్వకుండా నన్ను విమర్శించడం ఏ న్యాయం? ముందుగా వారి అభిప్రాయాలను చెప్పకపోగా, నా భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టేసే విధంగా ప్రయత్నం చేయడం, పత్రికల ద్వారా ఆరోపణలకు దిగడం న్యాయం కాదు. ఇంతజరిగినా నేను ఎక్కడా పార్టీని విమర్శించలేదు. పత్రికల ద్వారా నన్ను ఇబ్బందులకు గురిచేస్తూ, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేయడం... నా జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నందునే ఈ ప్రకటన చేస్తున్నాను.’