దండుకుంటున్నారు...!
Published Thu, Sep 19 2013 4:01 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM
వైరా,న్యూస్‌లైన్: జిల్లాలోని మద్యం షాపులకు, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని బేవరేజస్ కార్పోరేషన్‌కు చెందిన ఐఎంఎల్ డిపో అవినీతిమయంగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. డిపోలో వివిధ విభాగాల్లో వసూళ్ల పర్వం రానురాను మించిపోతోందని, డిపోలోకి అడుగు పెట్టినప్పటి నుంచి సరుకుతో బయటకు వచ్చేవరకు అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొందని మద్యం లెసైన్సుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మద్యం బాటిళ్ల బ్రేకేజి పేరుతో భారీస్థాయిలో ఈ డిపోలో అవినీతి జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. డిస్టలరీ కంపెనీల నుంచి లారీల్లో ఇక్కడకు వచ్చే మద్యం దిగుమతి అయ్యేటప్పుడు, డిపో నుంచి మద్యం కేసులు షాపులకు ఎగుమతులు చేసేటప్పుడు మద్యం బాటిళ్లు అధికంగా పగిలాయని రికార్డుల్లో చూపించి వాటిని బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో మొత్తం 149 వైన్‌షాపులు, 40 బార్లు, 3 క్లబ్‌లు ఉన్నాయి.
వీటికి బేవరేజెస్ కార్పోరేషన్‌కు చెందిన ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. నిత్యం లెసైన్సుదారులు ఇక్కడకు వచ్చి మద్యం తీసుకెళ్తుంటారు. ఈ డిపోకు రాష్ట్రంలోని హైదరాబాద్, శ్రీకాకుళం, సింగరాయకొండతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలోని డిస్టలరీ కంపెనీల నుంచి మద్యం దిగుమతి అవుతుంది. అయితే లారీల్లో రవాణా అయి ఇక్కడకు వచ్చిన మద్యం కేసులు దింపేటప్పుడు బ్రేకేజి పేరుతో భారీ దోపిడీకి పాల్పడతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీకి 1100 కేసుల మద్యం దిగుమతి అవుతుంది. బ్రేకేజి కింద ఒక కేసు మద్యం వరకు అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే అధికారులు రెండు నుంచి మూడు కేసుల వరకు మద్యం బ్రేకేజి చూపించి ఆ మద్యం బాటిళ్లను ఖమ్మం, మణుగూరుకు చెందిన తమకు అనుకూలంగా ఉండే వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలకు ఈ డిపోలో సుమారు 100 లారీల మద్యం దిగుమతి అవుతుంది.
ఈ చొప్పున ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు నెలకు సుమారు 200 కేసుల అన్ని రకాల మద్యంను స్వాహా చేస్తున్నారని, కేవలం బ్రేకేజి పేరుతోనే నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఒక్కో మద్యం లెసైన్సుదారు నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున ఇక్కడ బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇలా నెలకు 1.92 లక్షలు దాకా వసూలు చేస్తున్నారని, నెలవారి మాముళ్లు ఇవ్వకపోతే సరుకు కేటాయింపు, బిల్లులు చెల్లింపు, మద్యం డెలివరీలో తీవ్ర జాప్యం చేస్తారని లెసైన్సుదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మాముళ్లు ఇవ్వని వారికి వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా బీర్లు కేటాయించరని చెబుతున్నారు. డిస్టలరీల నుంచి లారీల్లో వచ్చిన మద్యాన్ని వెంటనే సక్రమంగా దించేందుకు మద్యం కంపెనీల ప్రతి నిధుల నుంచి కూడా మాముళ్లను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఉండే సుమారు 30 మంది ప్రతినిధులు ఇక్కడి అధికారులకు నెలవారి మాముళ్లు మూటచెప్పాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. మద్యం ఇండెంట్‌పై కోర్టుఫీ స్టాంప్, అధికారుల స్టాంప్‌లు వేసేందుకు, మద్యం డిపో నుంచి బయటకు వచ్చేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది స్థాయిబట్టి ముడుపులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. డిపోలో అక్రమాలు, అవి నీతి భారీస్థాయిలో చోటుచేసుకుంటున్నా ఉన్న తాధికారులు పట్టించుకోకపోవటంతో వీరి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుందంటున్నారు.
ఈ విషయమై డిపో మేనేజర్ సోమిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.... తమ డిపోలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవటంలేదని చెప్పారు. లెసైన్సుదారుల నుంచి నెల వారి మాముళ్లు వసూలు చేస్తున్నామనే విషయం అవాస్తవమన్నారు. బ్రేకేజీని నిబంధనలకు అనుగుణంగానే పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. బ్రేకేజి పేరుతో అవినీతి జరగడంలేదన్నారు. గత నెల మద్యం బాటిళ్ల బ్రేకేజి వివరాలను అడుగగా తన వద్ద ఉండవని చెప్పారు.
Advertisement
Advertisement