Viera
-
‘గులాబీ’లో వర్గపోరు
⇒ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ⇒ పార్టీ పరిశీలకురాలి ఎదుటే తన్నులాట ⇒ ఎమ్మెల్యే మదన్‌లాల్ పట్టించుకోవడం లేదని పలువురి విమర్శ ⇒ సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని ఆందోళన వైరా : టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా గురువారం వైరాలో కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. సభ్యత్వ నమోదు రాష్ట్ర పరిశీలకురాలు సత్యవతి రాథోడ్ ఎదుటే టీఆర్ఎస్ నాయకులు బాహాబాహీకి దిగి తన్నులాడుకున్నారు. గురువారం వైరాలో నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌పై ఒక వర్గం నాయకుడు వేల్పుల నర్సింహరావు పలు ఆరోపణలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి కనీసం సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మదన్‌లాల్ వర్గీయులు మరో వర్గంపై విమర్శలు చేస్తూ తోపులాడుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. సుమారు అరగంట పాటు ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నారుు. మదన్‌లాల్, సత్యవతి రాథోడ్, మరోనేత బేగ్ కార్యకర్తలను సముదారుుంచినా.. వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పరుగులు తీయూల్సి వచ్చింది. దమ్మపేటలో.. దమ్మపేట నియోజకవర్గంలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరస్పర ఆరోపణలు, తగాదాలతోనే నడిచింది. అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు వర్గాలు ఉన్నాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఉద్యమ నాయకులు ఒక వర్గంగా ఉన్నారు. తెలంగాణా ఉద్యమంలో పాల్గొని పార్టీ జెండాలు మోసిన తమకు సముచిత స్థానం దక్కడం లేదని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే చేస్తున్నారని ఉద్యమ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం టీఆర్ఎస్ నాయకుడు పోతినేని శ్రీరామవెంకటరావు నివాసంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల ముఖ్య నాయకులు సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు రాష్ట్ర పరిశీలకురాలు సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, నాయకులు ఎంకె బేగ్ హాజరయ్యారు. సభ్యత్వ నమోదు విషయంలో వారి ఎదుటే అశ్వారావుపేట మండలానికి చెందిన నాయకుడు ముబారక్బాబా, తుమ్మల వర్గీయుడు బండి పుల్లారావు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరినొకరు తోసుకునే స్థాయి వరకు వెళ్లారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాల గురించి తమకు కనీస సమాచారం ఇవ్వటం లేదని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జారె ఆదినారాయణ రాష్ట్ర ఇన్చార్జి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు సభ్యత్వ పుస్తకాలు ఇవ్వడానికి నాయకులు సంకోచిస్తున్నారని చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమై ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తాటి, సత్యవతి వారిని సముదారుుంచారు. సభ్యత్వ పుస్తకాలు మండల పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, అందరూ కలసి ఐక్యంగా నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వారు నాయకులకు సూచించారు. -
పట్టభద్రుల నమోదు ఇలా..
వైరా : పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సవరణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, తప్పులు సరిచేసుకునేందుకు, మార్పులు, చేర్పులతో పాటు పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఏయే దరఖాస్తుకు ఎలాంటి ఫారం కావాలి... అవి ఎక్కడ దొరుకుతాయి... ఎక్కడ దరఖాస్తు చేయాలి..? తదితర వివరాలు ఇలా... దరఖాస్తు విధానం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా http://ec-.in/ecimain1/formsvoters.aspx లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలు కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఫారంలో చూపిన చోట ఈ-మెయిల్, ఫోన్ నంబరు ఇస్తే నమోదు వివరాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సినవి... పట్టభద్ర (డిగ్రీ) ధ్రువీకరణ పత్రం ఓటరు గుర్తింపు కార్డు అర్హతలు ఇవీ... నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉండాలి. 2014 జనవరి 1వ తేదీకి మూడేళ్లకు ముందు భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. (డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి కావాలి) దేనికి ఏ ఫారం..? కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునే వారు ఫారం 18 పేరును తొలగించేందుకు ఫారం 7 ఓటు హక్కులో ఏమైనా మార్పులు చేయాలంటే ఫారం 8ఏ ఓటు హక్కులో కొత్తగా చేర్పులు చేయాలంటే ఫారం 8 పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు, పేరును తొలగించుకోవాలని అనుకునేవారు ఫొటో జత చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఎవరికి సమర్పించాలి..? పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గంలోని అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈనెల 25 నుంచి డిసెంబర్ 16లోగా దరఖాస్తులు అందించాలి. చేయకూడనివి... దరఖాస్తులో తప్పులు దిద్దినా (కొట్టివేతలు), దరఖాస్తు ఫారం చిరిగినా దానిని తిరస్కరిస్తారు. అదేవిధంగా ఏమైనా తప్పుడు సమాచారం పేర్కొంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు http:// ceo telangana.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు. -
కార్యక ర్తలకు అండగా ఉంటాం
వైరా : ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సేవ చేయాలనే తపన, కసితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. బుధవారం వైరా నియోజకవర్గ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక వాసవి కల్యాణ మండపంలో జరిగింది. 14 నెలల క్రితం పార్టీలోకి వచ్చి అందరి సలహాలు సూచనలు తీసుకోని పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నిక వరకు ప్రజల ప్రేమాభిమానాలను పొందుకుంటూ వచ్చామన్నారు. వెన్నుపోటు పొడిచినా తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. తనను గెలిపించి ఆదరించిన జిల్లా ప్రజలు, కార్యకర్తలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎవరైనా పార్టీని వీడాలనుకున్నా వారి వెంట వైఎస్సార్సీపీ శ్రేణులెవరూ వెళ్లరని అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, పార్టీని వీడాలనుకుంటున్నవారు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. పొంగులేటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, కొణిజర్ల మండల కన్వీనర్ రాయల పుల్లయ్య మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు శీలం కరుణాకర్ రెడ్డి, తేలప్రోలు నర్సింహారావు, శీలం వెంకటరామిరెడ్డి, ఏలూరి శ్రీను, ముళ్ళపాటి సీతారాములు, శీలం సురేందర్‌రెడ్డి, శీలం ఆదినారాయణరెడ్డి, మన్నెపల్లి శ్రీను, కొణిజర్ల మండల వైస్ ఎంపీపీ తాళ్ళూరి చిన్నపుల్లయ్య, దొడ్డపనేని రామారావు, పాముల వెంకటేశ్వర్లు, అప్పం సురేష్, నల్లమల్ల వెంకటేశ్వర్లు, కారేపల్లి మండల నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, జూలూరుపాడు నాయకులు పూర్ణకంటి నాగేశ్వరరావు, మిట్టపల్లి నాగి, కాంపాటి శేషగిరి, రే చర్ల సత్యం, తుమ్మల చిన్ని, జాలాది రామకృష్ణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఆరోగ్య రక్ష... అందని ద్రాక్ష
వైరా: రేపటి పౌరులైన బాలలకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన జవహర్ బాలల ఆరోగ్య రక్ష పథకం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా అటకెక్కింది. మూడేళ్ల కిందట ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో మాత్రం అమలవడం లేదు. గుర్తింపు కార్డులతో సరి జిల్లాలో ఈ ఏడాది ఒకటోతరగతిలో విద్యార్థులకు కూడా ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేసి సరిపెట్టారు. వైద్య పరీక్షలు మాత్రం నిర్వహించలేదు. ప్రాథమిక పాఠశాలల్లో 1,39,151 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 86,266 మంది, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో 46,644 మంది విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరయ్యాయి. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రధానంగా సాధారణ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు రక్తహీనత, కామెర్లు, కాళ్ళ వాపు, కంటి చూపు, మానసిక-శారీరక వైకల్యం తదితర పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్ష కార్డుల్లో నమోదు చేయాలి. ఇలా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలి. అనేక పాఠశాలలకు వైద్యులు వెళ్లనే లేదని సమాచారం. కమిటీ విధులు, విధానాలు ఆరోగ్య రక్ష పథకం అమలుకు మండలస్థాయిలో ఎంపీడీఓ చైర్మన్‌గా; ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, ఎంఈఓలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలను ఈ కమిటీ సందర్శించి పిల్లలకు వైద్య పరీక్షలు జరిగేలా చూడాలి. ప్రతి మంగళవారం ‘ఆరోగ్యం రోజు’గా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని రెఫరల్ ఆస్పత్రులకు తరలించాలి. వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్ఎం కూడా భాద్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిలిపించి వివరాలు తెలుసుకోవాలి. తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు ప్రగతి రికార్డులో నమోదయ్యాయో లేదో పరిశీలించాలి. కానీ, ఇవేవీ అమలవడం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. -
ఇదేం న్యాయం?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ జిల్లా నాయకత్వంపై వైరా ఎమ్మెల్యే డాక్టర్.బాణోతు చంద్రావతి లేఖాస్త్రాన్ని సంధించారు. పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరు, జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తన వ్యక్తిగత పనితీరు, గిరిజన ప్రజాప్రతినిధుల పట్ల కమ్యూనిస్టు పార్టీ వైఖరి తదితర అంశాలపై ఆమె మూడు పేజీల లేఖను గురువారం పత్రికలకు విడుదల చేశారు. తన స్వదస్తూరితో రాసిన ఈ లేఖలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. తాను ఎన్నికలలో ఎలా పోటీ చేశాననే అంశం నుంచి పార్టీలో, నియోజకవర్గంలో జరిగిన అన్ని పరిణామాలను అందులో వివరించారు. ముఖ్యంగా తనను ఏకాకిని చేసి జిల్లా పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు తప్ప... తానెలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీలో గిరిజన ప్రజాప్రతినిధులకు విలువ లేదని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి పార్టీని నాశనం చేస్తున్న వారికే ప్రాధాన్యమిస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ అవసరం కోసం మొదటిసారి తమ కుటుంబాన్ని సంప్రదించి పోటీచేయమని చెప్పిన వారు రెండోసారి కనీసం పోటీచేస్తావా అని తనను ఎందుకు అడగలేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలు సృష్టించి గిరిజనులను గెంటేసే ప్రయత్నం పార్టీలో జరుగుతోందని ఆమె ఘాటుగానే విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో గిరిజన వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి అంశంపై జిల్లాలో తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. వైరా ఎమ్మెల్యే చంద్రావతి సీపీఐకి గుడ్‌బై చెప్పబోతున్నారని, ఆమె ఇతర పార్టీలో చేరబోతున్నారని పత్రికల్లో వార్తలు రావడం.... అందుకు స్పందించిన సీపీఐ నాయకత్వం ఆమెపై ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం ఏ మలుపు తిరిగి ఎక్కడి మజిలీలను చేరుకుంటుందో వేచి చూడాల్సిందే....! చంద్రావతి పత్రికలకు విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలు ‘నేను సీపీఐలోనే ఉన్నాను. నాకు వేరే అభిప్రాయం లేదు. పార్టీ అంటే గౌరవం, అభిమానం ఎప్పటికీ ఉంటాయి. పార్టీ అవసరం కొద్దీ 2009లో మా కుటుంబాన్ని సంప్రదించి నన్ను వైరా నుంచి పోటీచేయమని అడిగారు. మాకై మేము టికెట్ అడగలేదు. చిన్నవయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరి సహకారంతో గెలిచాను. పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. మేమున్నాం.. అన్నీ చూసుకుంటామని చెప్పిన వారు ఈరోజున పరిస్థితులకు నన్ను బాధ్యురాలిని చేయడం ఎంత వరకు సమంజసం? వైరాలో పార్టీ అంత బలంగా లేదనేది వాస్తవం. నిర్మాణ పద్ధతులు నేర్చుకుంటూ పనిచేసే ప్రయత్నం చేశాను. దీనికి జిల్లా పార్టీ సహకారం లభించలేదు. కొందరు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చాలాసార్లు అగ్రనాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కానీ ఫలితం లేకపోయింది. స్వార్థంతో పనిచేస్తున్న వారిని నియంత్రించలేకపోయారు. పెంచిపోషించారు. అయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాను. శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. నేను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడంలో పార్టీ నుంచి నాకు సహకారం లభించలేదు. అసెంబ్లీలో కూడా నా వాణిని పార్టీ సూచనల ప్రకారం వినిపించాను. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా మొదటిసారి ఎన్నికై మంచి పేరు సంపాదించాను. నా పనితీరును సీపీఐతో పాటు ఇతర పార్టీల వారు అభినందించారు. పదవి ఉపయోగించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా పార్టీ కారణంగా నష్టపోయాను. ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించి అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేశాను. మళ్లీ పోటీ చేస్తారా లేదా అని నన్ను అడగలేదు. నా అభిప్రాయాన్ని తీసుకోలేదు. నాతో పార్టీ బాధ్యులు చర్చించి నాకు సూచనలు ఇవ్వడం కానీ, పరిస్థితిని వివరించే ప్రయత్నం కానీ చేయలేదు. అకస్మాత్తుగా మార్చి 7వ తేదీన జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో నన్ను మార్చే ఆలోచనను చెప్పారే కానీ ఖచ్చితంగా మారుస్తామని చెప్పడం లేదా వేరే పేర్లను ప్రకటించడం గాని చేయలేదు. నిర్ణయాన్ని జిల్లా ముఖ్యులకు వదిలేశామని చెప్పారు. ఈ ప్రక్రియ నన్ను బాధించింది. మనస్తాపం చెందాను. పార్టీ వారు ఎవరూ కనీసం నన్ను పట్టించుకోలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి..., నన్ను సంప్రదించి, నా ఆలోచన తెలుసుకోకుండా ఆరోపణలకు దిగడం ఎంతవరకు సబబు? గిరిజన మహిళనైన నన్ను ఈ విధంగా బాధ పెట్టడం తగదు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వల్ల ఈ సమస్య వచ్చింది. గ్రూపు రాజకీయాలు చేసే వారిని నమ్మి సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తులకు ప్రముఖ స్థానం కల్పిస్తూ, వారి మాటలకు విలువిచ్చి నాపై ఆరోపణలు చేయడం తగదు. గిరిజన మహిళనైన నన్ను ప్రోత్సహించాల్సింది పోయి సహకరించకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులకు ఏ గతి పడుతుందో అందరికీ తెలుసు. సమస్యలను సృష్టించి గెంటేస్తున్నారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. గిరిజన ప్రాంతాల్లో కూడా పార్టీ ముఖ్య బాధ్యతల్లో గిరిజనులకు అంత ప్రాధాన్యత ఉండడం లేదు. ఏకాకి ని చేసి ఏకపక్ష నిర్ణయాలను అమలుపర్చడానికి ప్రయత్నం చేశారే కానీ ఏ విషయంలోనూ నన్ను కలుపుకుని పోలేదు. కానీ, నేను ఏమీ బాధపడకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశాను. నిధుల కేటాయింపు పార్టీ ఇష్టానుసారమే జరిగింది. నా శక్తివంచన లేకుండా ఒక ఎమ్మెల్యేగా, మహిళగా ఎంతవరకు చేయగలనో చేసి సఫలీకృతమయ్యాను. ఐదుసంవత్సరాలల్లో ఒకేసారి ఎవరూ నియోజకవర్గ రూపురేఖలు మార్చలేరు. అభివృద్ధి ఎలా చేయాలో సూచనలు ఇవ్వకుండా నన్ను విమర్శించడం ఏ న్యాయం? ముందుగా వారి అభిప్రాయాలను చెప్పకపోగా, నా భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టేసే విధంగా ప్రయత్నం చేయడం, పత్రికల ద్వారా ఆరోపణలకు దిగడం న్యాయం కాదు. ఇంతజరిగినా నేను ఎక్కడా పార్టీని విమర్శించలేదు. పత్రికల ద్వారా నన్ను ఇబ్బందులకు గురిచేస్తూ, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేయడం... నా జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నందునే ఈ ప్రకటన చేస్తున్నాను.’ -
దండుకుంటున్నారు...!
వైరా,న్యూస్‌లైన్: జిల్లాలోని మద్యం షాపులకు, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని బేవరేజస్ కార్పోరేషన్‌కు చెందిన ఐఎంఎల్ డిపో అవినీతిమయంగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. డిపోలో వివిధ విభాగాల్లో వసూళ్ల పర్వం రానురాను మించిపోతోందని, డిపోలోకి అడుగు పెట్టినప్పటి నుంచి సరుకుతో బయటకు వచ్చేవరకు అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొందని మద్యం లెసైన్సుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మద్యం బాటిళ్ల బ్రేకేజి పేరుతో భారీస్థాయిలో ఈ డిపోలో అవినీతి జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. డిస్టలరీ కంపెనీల నుంచి లారీల్లో ఇక్కడకు వచ్చే మద్యం దిగుమతి అయ్యేటప్పుడు, డిపో నుంచి మద్యం కేసులు షాపులకు ఎగుమతులు చేసేటప్పుడు మద్యం బాటిళ్లు అధికంగా పగిలాయని రికార్డుల్లో చూపించి వాటిని బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 149 వైన్‌షాపులు, 40 బార్లు, 3 క్లబ్‌లు ఉన్నాయి. వీటికి బేవరేజెస్ కార్పోరేషన్‌కు చెందిన ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. నిత్యం లెసైన్సుదారులు ఇక్కడకు వచ్చి మద్యం తీసుకెళ్తుంటారు. ఈ డిపోకు రాష్ట్రంలోని హైదరాబాద్, శ్రీకాకుళం, సింగరాయకొండతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలోని డిస్టలరీ కంపెనీల నుంచి మద్యం దిగుమతి అవుతుంది. అయితే లారీల్లో రవాణా అయి ఇక్కడకు వచ్చిన మద్యం కేసులు దింపేటప్పుడు బ్రేకేజి పేరుతో భారీ దోపిడీకి పాల్పడతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీకి 1100 కేసుల మద్యం దిగుమతి అవుతుంది. బ్రేకేజి కింద ఒక కేసు మద్యం వరకు అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే అధికారులు రెండు నుంచి మూడు కేసుల వరకు మద్యం బ్రేకేజి చూపించి ఆ మద్యం బాటిళ్లను ఖమ్మం, మణుగూరుకు చెందిన తమకు అనుకూలంగా ఉండే వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలకు ఈ డిపోలో సుమారు 100 లారీల మద్యం దిగుమతి అవుతుంది. ఈ చొప్పున ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు నెలకు సుమారు 200 కేసుల అన్ని రకాల మద్యంను స్వాహా చేస్తున్నారని, కేవలం బ్రేకేజి పేరుతోనే నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఒక్కో మద్యం లెసైన్సుదారు నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున ఇక్కడ బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇలా నెలకు 1.92 లక్షలు దాకా వసూలు చేస్తున్నారని, నెలవారి మాముళ్లు ఇవ్వకపోతే సరుకు కేటాయింపు, బిల్లులు చెల్లింపు, మద్యం డెలివరీలో తీవ్ర జాప్యం చేస్తారని లెసైన్సుదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మాముళ్లు ఇవ్వని వారికి వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా బీర్లు కేటాయించరని చెబుతున్నారు. డిస్టలరీల నుంచి లారీల్లో వచ్చిన మద్యాన్ని వెంటనే సక్రమంగా దించేందుకు మద్యం కంపెనీల ప్రతి నిధుల నుంచి కూడా మాముళ్లను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఉండే సుమారు 30 మంది ప్రతినిధులు ఇక్కడి అధికారులకు నెలవారి మాముళ్లు మూటచెప్పాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. మద్యం ఇండెంట్‌పై కోర్టుఫీ స్టాంప్, అధికారుల స్టాంప్‌లు వేసేందుకు, మద్యం డిపో నుంచి బయటకు వచ్చేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది స్థాయిబట్టి ముడుపులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. డిపోలో అక్రమాలు, అవి నీతి భారీస్థాయిలో చోటుచేసుకుంటున్నా ఉన్న తాధికారులు పట్టించుకోకపోవటంతో వీరి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుందంటున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ సోమిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.... తమ డిపోలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవటంలేదని చెప్పారు. లెసైన్సుదారుల నుంచి నెల వారి మాముళ్లు వసూలు చేస్తున్నామనే విషయం అవాస్తవమన్నారు. బ్రేకేజీని నిబంధనలకు అనుగుణంగానే పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. బ్రేకేజి పేరుతో అవినీతి జరగడంలేదన్నారు. గత నెల మద్యం బాటిళ్ల బ్రేకేజి వివరాలను అడుగగా తన వద్ద ఉండవని చెప్పారు.