‘గులాబీ’లో వర్గపోరు | Factionalism in trs party | Sakshi
Sakshi News home page

‘గులాబీ’లో వర్గపోరు

Published Fri, Feb 13 2015 3:02 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

Factionalism in trs party

టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
పార్టీ పరిశీలకురాలి ఎదుటే తన్నులాట
ఎమ్మెల్యే మదన్‌లాల్ పట్టించుకోవడం లేదని పలువురి విమర్శ
సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని ఆందోళన


వైరా : టీఆర్‌ఎస్‌లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా గురువారం వైరాలో కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. సభ్యత్వ నమోదు రాష్ట్ర పరిశీలకురాలు సత్యవతి రాథోడ్ ఎదుటే టీఆర్‌ఎస్ నాయకులు బాహాబాహీకి దిగి తన్నులాడుకున్నారు. గురువారం వైరాలో నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌పై ఒక వర్గం నాయకుడు వేల్పుల నర్సింహరావు పలు ఆరోపణలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి కనీసం సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో మదన్‌లాల్ వర్గీయులు మరో వర్గంపై విమర్శలు చేస్తూ తోపులాడుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. సుమారు అరగంట పాటు ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నారుు. మదన్‌లాల్, సత్యవతి రాథోడ్, మరోనేత బేగ్ కార్యకర్తలను సముదారుుంచినా.. వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పరుగులు తీయూల్సి వచ్చింది.
 
దమ్మపేటలో..
దమ్మపేట నియోజకవర్గంలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరస్పర ఆరోపణలు, తగాదాలతోనే నడిచింది. అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు వర్గాలు ఉన్నాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఉద్యమ నాయకులు ఒక వర్గంగా ఉన్నారు. తెలంగాణా ఉద్యమంలో పాల్గొని పార్టీ జెండాలు మోసిన తమకు సముచిత స్థానం దక్కడం లేదని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే చేస్తున్నారని ఉద్యమ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం టీఆర్‌ఎస్ నాయకుడు పోతినేని శ్రీరామవెంకటరావు నివాసంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల ముఖ్య నాయకులు సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు రాష్ట్ర పరిశీలకురాలు సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, నాయకులు ఎంకె బేగ్ హాజరయ్యారు. సభ్యత్వ నమోదు విషయంలో వారి ఎదుటే అశ్వారావుపేట మండలానికి చెందిన నాయకుడు ముబారక్‌బాబా, తుమ్మల వర్గీయుడు బండి పుల్లారావు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరినొకరు తోసుకునే స్థాయి వరకు వెళ్లారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాల గురించి తమకు కనీస సమాచారం ఇవ్వటం లేదని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జారె ఆదినారాయణ రాష్ట్ర ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు సభ్యత్వ పుస్తకాలు ఇవ్వడానికి నాయకులు సంకోచిస్తున్నారని చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమై ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తాటి, సత్యవతి వారిని సముదారుుంచారు. సభ్యత్వ పుస్తకాలు మండల పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, అందరూ కలసి ఐక్యంగా నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వారు నాయకులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement