ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైరా : ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సేవ చేయాలనే తపన, కసితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. బుధవారం వైరా నియోజకవర్గ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక వాసవి కల్యాణ మండపంలో జరిగింది. 14 నెలల క్రితం పార్టీలోకి వచ్చి అందరి సలహాలు సూచనలు తీసుకోని పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నిక వరకు ప్రజల ప్రేమాభిమానాలను పొందుకుంటూ వచ్చామన్నారు.
వెన్నుపోటు పొడిచినా తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. తనను గెలిపించి ఆదరించిన జిల్లా ప్రజలు, కార్యకర్తలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎవరైనా పార్టీని వీడాలనుకున్నా వారి వెంట వైఎస్సార్‌సీపీ శ్రేణులెవరూ వెళ్లరని అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, పార్టీని వీడాలనుకుంటున్నవారు పునరాలోచన చేసుకోవాలని సూచించారు.
పొంగులేటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..
వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, కొణిజర్ల మండల కన్వీనర్ రాయల పుల్లయ్య మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు శీలం కరుణాకర్ రెడ్డి, తేలప్రోలు నర్సింహారావు, శీలం వెంకటరామిరెడ్డి, ఏలూరి శ్రీను, ముళ్ళపాటి సీతారాములు, శీలం సురేందర్‌రెడ్డి, శీలం ఆదినారాయణరెడ్డి, మన్నెపల్లి శ్రీను, కొణిజర్ల మండల వైస్ ఎంపీపీ తాళ్ళూరి చిన్నపుల్లయ్య, దొడ్డపనేని రామారావు, పాముల వెంకటేశ్వర్లు, అప్పం సురేష్, నల్లమల్ల వెంకటేశ్వర్లు, కారేపల్లి మండల నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, జూలూరుపాడు నాయకులు పూర్ణకంటి నాగేశ్వరరావు, మిట్టపల్లి నాగి, కాంపాటి శేషగిరి, రే చర్ల సత్యం, తుమ్మల చిన్ని, జాలాది రామకృష్ణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.