నేటి నుంచి సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్‌లలో సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణంతో పాటే క్యాబ్, పోర్టల్ బుకింగ్ సదుపాయాలను ఐఆర్‌సీటీసీ( ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు రైలు దిగిన వెంటనే పోర్టర్, క్యాబ్ సర్వీసుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఐఆర్‌సీటీసీయే కొత్తగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. శనివారం నుంచి సికింద్రాబాద్, తిరుపతి రైల్వేస్టేషన్‌లలో ఈ సేవలు అమల్లోకి రానున్నాయి. త్వరలో విజయవాడ,గుంటూరు రైల్వేస్టేషన్‌లలో కూడా ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి 36 గంటలు ముందు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఆర్‌సీటీసీ.కో.ఇన్’ లేదా ‘డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. ఐఆర్‌సిటీసీ టూరిజం.కమ్.’ సైట్‌లలో క్యాబ్, పోర్టర్‌లను బుక్ చేసుకోవచ్చు.
రెండు రకాల సేవలను కలిపి లేదా విడివిడిగా బుక్ చేసుకోవచ్చు. అనంతరం ప్రయాణికులకు ట్రైన్ దిగిన వెంటనే క్యాబ్, పోర్టర్ సర్వీసుల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్, ఇతర వివరాలు రైల్వే సిబ్బంది తెలియజేస్తారు. అంతేకాకుండా స్వయంగా క్యాబ్, పోర్టర్‌లను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో,ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద న్యూఢిల్లీ, సికింద్రాబాద్, విశాఖపట్నం,ముంబై నుంచి వచ్చే రైళ్లకూ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని రైళ్లకు క్యాబ్,పోర్టర్ సదుపాయాలను విస్తరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
ఇక రైలుతోపాటే క్యాబ్
Published Sat, Feb 21 2015 2:38 AM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM
Advertisement