కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 12 పనులను సోమవారం అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ నుంచి తొగుట మండలం తుక్కాపూర్ వరకు సొరంగంలోనే కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మల్లన్నసాగర్ సొరంగం, పంప్‌హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఓ వైపు మల్లన్నసాగర్.. మరోవైపు కాళేశ్వరం
మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అవసరమైతే లేబర్ సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా.. పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికే 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్ లైనింగ్ పూర్తయినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మసాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, యాదాద్రి జిల్లాలోని గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శామీర్‌పేటకు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఫలాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. వారం, పది రోజుల్లో పంప్‌హౌస్ పనులు, సర్జిఫుల్ గేట్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు.
ఒకవైపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరుగుతుండగా.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సొరంగం, పంప్‌హౌస్‌ల ద్వారా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన భారీ మోటార్లు విదేశాల నుంచి తీసుకొచ్చి.. పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం సొరంగంలో పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment