ఇక ఐటీ ఉద్యోగులపై మరింత నిఘా!
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగులపై ఇక నుంచి ఆ సంస్థలు ఓ కన్నేసి ఉంచబోతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఎస్) లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వివరాలను ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసే ఐటీ ఉద్యోగులపై నిఘా పెట్టాలని సైబరాబాద్ పోలీసుల సలహా కమిటీ.. సాప్ట్వేర్ కంపెనీలకు సూచించింది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలలో ఐటీ ఉద్యోగులకు భాగస్వామ్యం ఉంటుందేమో అన్న ముందు జాగ్రత్తలతో సైబరాబాద్ పోలీసులు ఈ విషయాలను సాప్ట్వేర్ కంపెనీలకు తెలుపుతూ ఆ సంస్థలను అప్రమత్తం చేశారు. సంస్థ ఉద్యోగులు ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం సేకరిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ట్రాప్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటీ, దానికి అనుబంధ కంపెనీల యాజమాన్యాలతో సైబరాబాద్ పోలీసులు కొన్ని రోజుల కిందట రెండు సార్లు సమావేశమైన విషయం తెలిసిందే. పౌరుల భద్రత దృష్ట్యా ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర సంఘవిద్రోహ అంశాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు సంస్థ ఉద్యోగులపై నిఘా పెట్టాలని వారికి పోలీసులు సూచించారు.