జాతీయ రహదారిగా మారనున్న కోదాడ రోడ్డు
మిర్యాలగూడ : ఆర్‌అండ్‌బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల– కోదాడ రోడ్డు ఇక జాతీయ రహదారిగా మారనున్నది. 214 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డు మరింత వెడల్పు కానున్నది. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 7 మీటర్ల వెడ్పల్పులో బీటీ ఉంది. కాగా దానిని జాతీయ రహదారిగా గుర్తించడం వల్ల పది మీటర్ల వెడల్పుకు విస్తరించనున్నారు.
ఈ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రోడ్డు నిర్మాణాన్ని మొత్తం ఐదు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో 510 కోట్ల రూపాయలతో రెండు ప్యాకేజీలు జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు 94 కిలో మీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న మరో మూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి.
మల్లేపల్లి– అలీనగర్ (హాలియా), అలీనగర్ (హాలియా) – మిర్యాలగూడ వరకు 80 కిలోమీటర్ల వరకు 500 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. మిర్యాలగూడ – కోదాడ వరకు 40 కిలో మీటర్ల మేర మరో 200 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కావాల్సి ఉంది. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పనులు కూడా త్వరలో చేపట్టనున్నారు. మల్లేపల్లి నుంచి హాలియా వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, విద్యుత్ స్థంబాలు తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది.
ఇవీ..ప్యాకేజీలు
జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారు. వాటిలో 94 కిలోమీటర్ల మేర జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు విభజించారు. మిగతా 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో మల్లేపల్లి– హాలియా (అలీనగర్), హాలియా – మిర్యాలగూడ, మిర్యాలగూడ – కోదాడ వరకు విభజించారు. ఒక్కొక్క ప్యాకేజీకి 40 కిలోమీటర్లు ఉండే విధంగా విభజించారు.
ఫోర్‌వే ఉన్న చోటనే డివైడర్లు
గతలో ఆర్‌అండ్‌బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల నుంచి కోదాడ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించారు. 214 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రోడ్డు వంద ఫీట్ల వెడల్పు ఉండే విధంగా నిర్మాణం చేస్తారు. దానిలో 10 మీటర్ల వెడల్పులొనే బీటీ వేస్తారు. ప్రస్తుతం ఆ రోడ్డు 7 మీటర్ల మేర బీటీ ఉండగా దానిని పది మీటర్లకు పెంచుతారు.
అందుకని రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేయరు. ప్రధాన పట్టణాలు ఉన్న చోట నాలుగులైన్ల రోడ్డు నిర్మిస్తారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మించిన చోట మాత్రమే డివైడర్లు ఏర్పాటు చేస్తారు. మిగతా రోడ్డు డివైడర్ లేకుండానే ఉంటుంది. అంతే కాకుండా ఎక్కడ కూడా బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు. అందుకని ప్రస్తుతం ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. అందుకు గాను రూ.500 కోట్లతో రెండు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మరో ప్యాకేజీకి కూడా టెండర్లు చివరి దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల భూములు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం తప్పనిసరిగా అందుతుంది. – లింగయ్య, ఏఈ, జాతీయ రహదారుల విభాగం
Comments
Please login to add a commentAdd a comment