zadcharla
-
హాస్టల్ విద్యార్థుల కిచిడిలో ఎలుక
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని ఎస్సీ హాస్టల్లో బుధవారం అల్పాహారంలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అల్పాహారం కోసం సిబ్బంది కిచిడి తయారు చేశారు. వండి వార్చిన కిచిడిని విద్యార్థులకు వడ్డిస్తుండగా ఒక విద్యార్థి ప్లేటులో చిన్న ఎలుక కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే ఇతర విద్యార్థులకు అల్పాహారం వడ్డించకుండా బయటకు పారవేశారు. మళ్లీ వండి వార్చారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణకు బాలానగర్ హాస్టల్ ఇన్చార్జ్ బాధ్యతలు ఉండటంతో ఆయన అక్కడ ఉన్నారు. విషయం తెలియగానే భవిష్యత్‌లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. అయితే బాదేపల్లి జెడ్పీహైస్కూల్‌కు ఎస్సీ వసతి గృహం నుంచి వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎలుక విషయం వెలుగు చూసింది. హైస్కూల్‌కు నూతన గేట్ పెట్టి దానిని మూసివేయడంతో ఆలస్యమైన విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఆలస్యానికి గల కారణాలను ఎంఈఓ మంజులాదేవి, ఉపాధ్యాయులు ఆరా తీయగా అల్పాహారంలో ఎలుక రావడం వల్ల వంట ఆలస్యమైందని విద్యార్థులు చెప్పారన్నారు. -
అప్పు.. ఆయువు తీసింది!
బాలానగర్ (జడ్చర్ల): అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీ చెన్నంగులగడ్డతండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాబునాయక్ (33) తన వ్యవసాయ పొలంలో నాలుగుబోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే స్తోమత లేక భార్య లీలను ఆమె పుట్టింటికి పంపాడు. మూడురోజుల తర్వాత కూడా డబ్బు సర్దుబాటు కాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. అప్పిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలంటూ మదనపడిన బాబునాయక్ శనివారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకూ తలుపులు తీయకపోవడాన్ని తండ్రి హేమ్య నాయక్ గమనించాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టాడు. కొడుకు ఉరేసుకోవడాన్ని చూసి, పోలీసులకు, భార్యకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి..
నవాబుపేట(జడ్చర్ల) : రొట్టే ముక్క చేత పట్టుకుని.. తినేందుకు చేతిని లేపగానే.. ఇంతలో పక్కింటి మహిళ కేకలు వినిపించాయి. వెంటనే రొట్టె ముక్కను అక్కడే పడేసి పరుగున వెళ్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడాడు. కానీ ఈ ప్రమాదంలో బలైపోయాడు ఓ వ్యక్తి.. ఈ విషాదకర సంఘటన మండలంలోని కొల్లూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ సోమవారం ఉదయం దుస్తులు ఉతికి ఇంటి ముందున్న తీగ ఆరేస్తోంది. ఇంతలో విద్యుత్ వైరు తీగకు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. వెంటనే పక్కింట్లో రొట్టె తింటున్న ముష్టి కృష్ణయ్య(45) మహిళ కేకలు వినిపించగానే రొట్టెను పక్కన పెట్టేసి వెంటనే మహిళను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తాను విద్యుదాఘాతానికి షాక్‌కు అక్కడికక్కడే కన్నుమూశాడు. అపస్మారక స్థితిలో నుంచి.. విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న అంజమ్మను గమనించిన వాసుయాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఊపిరి ఆగిపోకుండా చేతులతో మోది స్పృహ వచ్చేలాచేశాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడింది. కాపాడేందుకు వెళ్లిన కృష్ణయ్య విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే విద్యుత్ తీగలు, ఎర్త్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యాంకర్ సుమకు ‘రైతు బంధు’ చెక్కు
బాలానగర్ (జడ్చర్ల): మండలంలోని హేమాజీపూర్ గ్రామ పాఠశాలను సినీ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు బుధవారం సందర్శించారు. హేమాజీపూర్ శివార్లలో వారికి వ్యవసాయం పొలం ఉండగా వచ్చారు. ఈ సందర్భంగా వారు గతంలో పాఠశాలలకు ప్రొజెక్టర్, లాప్‌ట్యాప్‌లు బహూకరించగా వాటిని వారు పరిశీలించారు. అనంతరం రాజీవ్–సుమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందాలనే భావనతో రూ.లక్ష వ్యయంతో వీటిని అందజేశామన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నందున ప్రైవేటు పాఠశాలల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ మేరకు సుమ, రాజీవ్‌తో పలువురు గ్రామస్తులు ఫొటోలు దిగారు. ‘రైతు బంధు’ చెక్కు వెనక్కి.. హేమాజీపూర్ గ్రామ శివారులో తమకు ఉన్న భూమికి సంబంధించి సినీ నటుడు రాజీవ్‌కు ప్రభుత్వం నుంచి తాజాగా రూ.29 వేల విలువైన పెట్టుబడి సాయం చెక్కు అందింది. అయితే, తాను ఆర్థికంగా కొంత మేర స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించేలా చూడాలని కోరుతూ ఆ చెక్కును రాజీవ్ బుధవారం తహసీల్దార్ రాంబాయికి అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మురళీదర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, కరుణాకర్‌తో పాటుబాలానగర్ రైతు సమన్వయ కన్వీనర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో... జడ్చర్ల టౌన్: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం రాజీవ్ కనకాల, సుమ దంపతులు వచ్చారు. భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో వారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. -
జడ్చర్లలో రాజీవ్ కనకాల సందడి
జడ్చర్ల : జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సినీనటుడు రాజీవ్ కనకాల బుధవారం కొద్దిసేపు సందడి చేశారు. ఆయన బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామ శివారులో గల తన సొంత భూమికి సంబందించి బ్యాంకు లోన్ నిమిత్తం తనఖా పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్ అశోక్‌తో మాట్లాడి నిబందనల మేరకు సంతకాలు చేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనను చూసేందుకు వచ్చారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలి ప్రసవం
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : ప్రభుత్వ ఆశయాన్ని ఆచరణలో చూపించారు ఓ వైద్యురాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సం ఖ్య పెంచాలన్న ఆదేశాల మేరకు వైద్యు లు, సిబ్బంది గర్భి ణులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, చెప్పడం కాదు తాను సైతం పాటించాలన్న భావనతో ఓ వైద్యురా లు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. జడ్చర్ల మండ లం గంగాపురం పీహెచ్సీలో డాక్టర్ మంజుభార్గవి, ఆమె భర్త డాక్టర్ విష్ణు నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ ఆమనగల్లులో నివాసముంటున్నారు. ఈ దం పతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా, ప్రస్తుతం మంజుభార్గవి గర్భంతో ఉంది. అయితే, తాను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తానన్న ఆమె సూచనకు భర్తతో పాటు మిగ తా కుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం రాత్రి ఆమెను నొప్పులు రాగా, కల్వకుర్తి సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ రమ ఆమెకు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. రెండో కాన్పులో కూడా మంజుభార్గవి కుమారుడే జన్మించగా... మాటలు చెప్పడమే కాదు ఆచరణలో చూపించిన ఆమెను పలువురు అభినందించారు. -
వాడ్యాల్లో రెవెన్యూ అధికారుల నిర్బంధం
మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని వాడ్యాల్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను నిర్బంధించారు. భూ పక్షాళణలో జరిగిన తప్పులను సరిచేయడానికి సోమవారం రెవెన్యూ అధికారుల బృందం గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలో ప్రభుత్వ భూమి సర్వే నం.0లో దాదాపు 60 మంది రైతులు సాగులో ఉండగా, వారికి రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదు. అలాగే సర్వే నం.229లో ఉన్న అసైన్డ్ భూమిలో పట్టా ఉన్న రైతులకు కూడా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అరుణ చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తహసీల్దార్ పాండునాయక్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆర్డీఓకు ఫోన్లో వివరించగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అధికారులను వదిలిపెట్టారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పా సు పుస్తకంతోపాటు చెక్కులను అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. -
ఏమ్మా.. ఈ డబ్బు ఏం చేస్తావ్?
నవాబుపేట(జడ్చర్ల) : ఏమ్మా.. ఈ డబ్బులు ఏం చేస్తావ్... అని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న మహిళను ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్ రొనాల్డ్‌రోస్. నవాబుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతు బంధు చెక్కుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వెళ్తున్న మహిళతో ఆయన మాట్లాడారు. లింగంపల్లికి చెందిన భారతమ్మ తనకు రూ.14వేలు వచ్చాయిని, ఈ డబ్బులను వ్యవసాయానికే ఉపయోగిస్తానని చెప్పడంతో అభినందించారు. ఈ మేరకు కలెక్టర్ తీగలపల్లి, రుద్రారం, సిద్దోటం గ్రామాల్లో చెక్కుల పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, మండల స్పెషల్ అధికారి కొమురయ్య, మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్‌లు రుద్రారం లక్ష్మి, సిద్దోటం నర్సింహులు, వైస్ ఎంపీపీ నారాయణ, బాలకిష్టయ్య, మధు, యాదిరెడ్డి, కృష్ణ, సంతో‹ష్ పాల్గొన్నారు. అర్హులందరికీ చెక్కులు జడ్చర్ల : రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ చెక్కులు అందజేస్తామని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివాదస్పద భూములు మినహా రైతులకు వంద శాతం చెక్కులు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఈనెల 18 నుండి ప్రతీ గ్రామంలో తమ సిబ్బంది పర్యటించి కోర్టు కేసులు మినహాయించి వివాదాల్లో ఉన్న భూముల విషయమై విచారించి ఆయా రైతులకు కూడా చెక్కులు అందేలా చూస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఏడీఏ నిర్మల, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జంగయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
జడ్చర్ల– కోదాడ..ఇక హైవే
మిర్యాలగూడ : ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల– కోదాడ రోడ్డు ఇక జాతీయ రహదారిగా మారనున్నది. 214 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డు మరింత వెడల్పు కానున్నది. ఆర్అండ్బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 7 మీటర్ల వెడ్పల్పులో బీటీ ఉంది. కాగా దానిని జాతీయ రహదారిగా గుర్తించడం వల్ల పది మీటర్ల వెడల్పుకు విస్తరించనున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రోడ్డు నిర్మాణాన్ని మొత్తం ఐదు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో 510 కోట్ల రూపాయలతో రెండు ప్యాకేజీలు జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు 94 కిలో మీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న మరో మూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మల్లేపల్లి– అలీనగర్ (హాలియా), అలీనగర్ (హాలియా) – మిర్యాలగూడ వరకు 80 కిలోమీటర్ల వరకు 500 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. మిర్యాలగూడ – కోదాడ వరకు 40 కిలో మీటర్ల మేర మరో 200 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కావాల్సి ఉంది. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పనులు కూడా త్వరలో చేపట్టనున్నారు. మల్లేపల్లి నుంచి హాలియా వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, విద్యుత్ స్థంబాలు తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇవీ..ప్యాకేజీలు జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారు. వాటిలో 94 కిలోమీటర్ల మేర జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు విభజించారు. మిగతా 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో మల్లేపల్లి– హాలియా (అలీనగర్), హాలియా – మిర్యాలగూడ, మిర్యాలగూడ – కోదాడ వరకు విభజించారు. ఒక్కొక్క ప్యాకేజీకి 40 కిలోమీటర్లు ఉండే విధంగా విభజించారు. ఫోర్వే ఉన్న చోటనే డివైడర్లు గతలో ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల నుంచి కోదాడ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించారు. 214 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రోడ్డు వంద ఫీట్ల వెడల్పు ఉండే విధంగా నిర్మాణం చేస్తారు. దానిలో 10 మీటర్ల వెడల్పులొనే బీటీ వేస్తారు. ప్రస్తుతం ఆ రోడ్డు 7 మీటర్ల మేర బీటీ ఉండగా దానిని పది మీటర్లకు పెంచుతారు. అందుకని రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేయరు. ప్రధాన పట్టణాలు ఉన్న చోట నాలుగులైన్ల రోడ్డు నిర్మిస్తారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మించిన చోట మాత్రమే డివైడర్లు ఏర్పాటు చేస్తారు. మిగతా రోడ్డు డివైడర్ లేకుండానే ఉంటుంది. అంతే కాకుండా ఎక్కడ కూడా బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు. అందుకని ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రోడ్డు మీదుగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభం జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. అందుకు గాను రూ.500 కోట్లతో రెండు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మరో ప్యాకేజీకి కూడా టెండర్లు చివరి దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల భూములు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం తప్పనిసరిగా అందుతుంది. – లింగయ్య, ఏఈ, జాతీయ రహదారుల విభాగం -
పట్టపగలే దొంగల హల్చల్
జడ్చర్ల మహబూబ్ నగర్ : గుర్తుతెలియని దుండగులు పట్టపగలే హల్చల్ సృష్టించారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడి.. అతని కణతపై పిస్టల్ గురిపెట్టి.. మరొకరు చాకు దూశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన బాదేపల్లి పట్టణంలోని రంగారావుతోటలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుడు రాజేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఉపాధ్యాయుడు రాజేశ్వర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటిలోకి తాగునీటిని తీసుకువచ్చిన అనంతరం దుస్తులు ఇస్త్రీ చేయించేందుకు బ్యాగు తీసుకొని బయటకు వస్తుండగా అకస్మాత్తుగా గేటును తోసుకుని ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి బయటకు వస్తూ ఎవరు మీరని ప్రశ్నించారు. వారు ఏదో గుర్తించని భాషలో మాట్లాడుతూ పైపైకి వచ్చారు. వచ్చీ రాగానే గొంతును నొక్కిపట్టి ఓ వ్యక్తి ప్యాంటు జేబులో నుంచి తుపాకీ తీసి కణతకి గురిపెట్టాడు. మరో చేతిలో ఉన్న చాకును కడుపునకు ఆనించాడు. వెనువెంటనే ఉన్న మరో ఇద్దరు దుండగులు ఇంటి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితిని పసిగట్టిన రాజేశ్వర్‌రెడ్డి భార్య లక్ష్మి, పిల్లలు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. దీంతో చుట్టుపక్కల వారు అరుపులు విని బయటకు వచ్చి చూసేలోగానే దుండగులు రాజేశ్వర్‌రెడ్డిని గొంతును వదిలి బయటకు పరుగులు తీసి పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో ఉన్న పదునైన కత్తిని గేటు దగ్గరే పారేసి వెళ్లారు. రాజేశ్వర్‌రెడ్డి గొంతును దుండుగులు గట్టిగా అదిమి పట్టిన సందర్భంగా ఛాతి భాగంలో గోరు గుచ్చుకుని చిన్నపాటి గాయమైంది. దీంతో ఒక్కసారిగా బాధిత కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసేలోగా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి అర్థమయ్యేలోగా దుండుగులు పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30-35 ఏళ్ల వయస్సు వారే.. దుండగులు ఇంట్లోకి చొరబడి పిస్టల్‌తో ఇంటి యజమానిని బెదిరించిన ఘటన పట్టణంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. ఇప్పటి వరకు కేవలం దొంగతనాలు మాత్రమే జరిగాయి. కానీ ఏకంగా పిస్టల్, కత్తి చూపి దాడికి పాల్పడిన ఘటన ఇదే మొదటిది. దుండగులు హిందీ తరహా భాష మాట్లాడారంటే వారు ఇతర రాష్ట్రానికి చెందినవారై ఉండవచ్చని భావిస్తున్నారు. ఎరుపు, బ్లూ రంగుల షర్టులు ధరించి ఉన్నారని, మరొకరు తలకు కర్చీఫ్ కట్టుకున్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. అంతా 30-35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటారన్నారు. అయితే దుండగులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి తలుపులు మూసి కుటుంబ సభ్యులను తుపాకీ, కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లేలా ప్రణాళిక వేసి ఉంటారని అయితే ఊహించని విధంగా దుండగులు ఇంటి గేటు తెరుచుకుని ఇంట్లోకి వచ్చే తరుణంలోనే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు వారికి ఎదురుగా రావడంతో విఫలమై ఉంటుందని పేర్కొంటున్నారు. వారు ఏమాత్రం ఇంట్లోకి వచ్చినా పరిస్థితి మరోలా ఉండేదని భావిస్తున్నారు. ముమ్మర దర్యాప్తు.. సంఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ భాస్కర్, సీఐ బాలరాజుయాదవ్ తదితరులు సందర్శించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి విచారించారు. సీసీ పుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని గుర్తించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, లాడ్జీలలో తనిఖీలు చేపట్టారు. కేసును ఛేదించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
టైర్ పగిలి అదుపు తప్పిన కారు
బాలానగర్ (జడ్చర్ల) మహబూబ్ నగర్ : వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు టైరు పగిలి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో సోమవారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏఎస్ఐ గోపాల్ కథనం ప్రకారం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కుడి వైపు ముందుటైర్ పగిలి డివైడర్ పైనుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో శ్రీకాంత్(33) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. హైదరాబాద్ వైపు బెంగుళూరు వైపు వెళ్తున్న కారులో తగరం దేవన్న, విఠల్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాంత్‌ది కర్నూలు జిల్లా జవహారపురం స్వగ్రామం. దేవన్న, విఠల్‌లు హైదరాబాద్‌కు చెందినవారు. గాయపడిన వారిని జీఎంఆర్ అంబులెన్స్‌లో షా ద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంత రం శ్రీకాంత్ మృతదేహానికి షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
పుష్కరాలకు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా
30 మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం మహబూబ్‌నగర్ జిల్లా గురజాల వద్ద ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి జూపల్లి ఎల్లారెడ్డిపేట : కృష్ణ పుష్కరాల కోసం భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో వెళ్తున్న సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిపరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు, పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణ పుష్కరాల్లో భాగంగా పుణ్యస్నానాలు చేసేందుకు మండలంలోని అల్మాస్‌పూర్‌కు చెందిన 50 మంది భక్తులతోపాటు గొల్లపల్లికి చెందిన ముగ్గురు, నారాయణపూర్‌కు చెందిన ఒకరు, నిజామాబాద్ జిల్లా చుక్కాపూర్కు చెందిన నలుగురు సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో మహబూబ్‌నగర్ జిల్లా జోగులాంబ పుష్కరఘాట్‌కు మంగళవారం వేకువజామున బయల్దేరారు. వాహనం మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో 30 మంది గాయపడ్డారు. అల్మాస్‌పూర్‌కు చెందిన రోండ్ల కిష్టారెడ్డి, బోడ్డు నర్సవ్వ, వంగల మణెమ్మ, మారోజు భూమయ్య, కుమ్మరి లక్ష్మి, గుమ్మడిదారి లక్ష్మి, ఉచ్చిడి శంకర్‌రెడ్డి, పెద్దవేణి మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామందికి కాళ్లుచేతులు విరిగినట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన గురిజాల వెంకట్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి ప్రమాదం ప్రైవేటు బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న స్థానిక జెడ్పీటీసీ తోట ఆగయ్య మంత్రి కేటీఆర్‌కు చేరవేశారు. ఆయన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును అప్రమత్తం చేశారు. కేటీఆర్ సూచన మేరకు జూపల్లి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో వారివారి స్వగ్రామాలకు పంపించారు. -
అప్పు చెల్లించాలంటూ టీవీ ఎత్తుకెళ్లారు
జడ్చర్ల్లలో సహకార సంఘం అధికారుల నిర్వాకం జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కావేరమ్మపేటలో జంగయ్య అనే రైతు బాకీ చెల్లించలేదని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారులు మంగళవారం ఆయన ఇంట్లో నుంచి టీవీని ఎత్తుకెళ్లారు. 1994లో జంగయ్య తండ్రి చిన్న లక్ష్మయ్య బాదేపల్లి సహకార సంఘంలో రూ.36 వేలు అప్పు తీసుకున్నాడు. తండ్రి చేసిన అప్పులో సుమారు రూ. 35 వేలను జంగయ్య చెల్లించాడు. అనంతరం అప్ప ట్లో వైఎస్ ప్రభుత్వం రైతురుణాలు మాఫీ చేయడంతో తన అప్పు కూడా మాఫీ అయిందని భావించాడు. అయితే, తనకు 5 ఎకరాలకుపైగా భూమి ఉండడంతో బకాయి మాఫీ కాలేదంటూ సహకార సంఘం అధికారులు అప్పును రూ. లక్షకు పైగా చేశారు. కొంత గడువు కావాలని అడిగినా వినకుండా ఇంట్లో ఉన్న టీవీ ఎత్తుకెళ్లారు. అప్పు చెల్లించాలని నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో చట్ట ప్రకారం గా చర్యలు తీసుకుంటున్నామని బాదేపల్లి శాఖ సూపర్వైజర్ యాదగిరి చెప్పారు.