- 30 మందికి గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
- మహబూబ్‌నగర్ జిల్లా గురజాల వద్ద ఘటన
- క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి జూపల్లి
ఎల్లారెడ్డిపేట : కృష్ణ పుష్కరాల కోసం భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో వెళ్తున్న సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిపరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు, పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణ పుష్కరాల్లో భాగంగా పుణ్యస్నానాలు చేసేందుకు మండలంలోని అల్మాస్‌పూర్‌కు చెందిన 50 మంది భక్తులతోపాటు గొల్లపల్లికి చెందిన ముగ్గురు, నారాయణపూర్‌కు చెందిన ఒకరు, నిజామాబాద్ జిల్లా చుక్కాపూర్‌కు చెందిన నలుగురు సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో మహబూబ్‌నగర్ జిల్లా జోగులాంబ పుష్కరఘాట్‌కు మంగళవారం వేకువజామున బయల్దేరారు. వాహనం మహబూబ్‌నగర్ జిల్లా గురజాల సమీపంలోని మాచారం వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో 30 మంది గాయపడ్డారు. అల్మాస్‌పూర్‌కు చెందిన రోండ్ల కిష్టారెడ్డి, బోడ్డు నర్సవ్వ, వంగల మణెమ్మ, మారోజు భూమయ్య, కుమ్మరి లక్ష్మి, గుమ్మడిదారి లక్ష్మి, ఉచ్చిడి శంకర్‌రెడ్డి, పెద్దవేణి మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామందికి కాళ్లుచేతులు విరిగినట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన గురిజాల వెంకట్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మంత్రి కేటీఆర్ దృష్టికి ప్రమాదం
ప్రైవేటు బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న స్థానిక జెడ్పీటీసీ తోట ఆగయ్య మంత్రి కేటీఆర్‌కు చేరవేశారు. ఆయన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును అప్రమత్తం చేశారు. కేటీఆర్ సూచన మేరకు జూపల్లి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో వారివారి స్వగ్రామాలకు పంపించారు.