
ఎస్సీ వసతి గృహం విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ మంజూలాదేవి
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లోని ఎస్సీ హాస్టల్‌లో బుధవారం అల్పాహారంలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అల్పాహారం కోసం సిబ్బంది కిచిడి తయారు చేశారు. వండి వార్చిన కిచిడిని విద్యార్థులకు వడ్డిస్తుండగా ఒక విద్యార్థి ప్లేటులో చిన్న ఎలుక కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే ఇతర విద్యార్థులకు అల్పాహారం వడ్డించకుండా బయటకు పారవేశారు.
మళ్లీ వండి వార్చారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణకు బాలానగర్ హాస్టల్ ఇన్‌చార్జ్ బాధ్యతలు ఉండటంతో ఆయన అక్కడ ఉన్నారు. విషయం తెలియగానే భవిష్యత్‌లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు.
అయితే బాదేపల్లి జెడ్పీహైస్కూల్‌కు ఎస్సీ వసతి గృహం నుంచి వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎలుక విషయం వెలుగు చూసింది. హైస్కూల్‌కు నూతన గేట్ పెట్టి దానిని మూసివేయడంతో ఆలస్యమైన విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఆలస్యానికి గల కారణాలను ఎంఈఓ మంజులాదేవి, ఉపాధ్యాయులు ఆరా తీయగా అల్పాహారంలో ఎలుక రావడం వల్ల వంట ఆలస్యమైందని విద్యార్థులు చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment