దేవరకొండ : 2014లో ప్రతిపాదనలు.. 2016లో సాంక్షన్ అప్రూవల్.. 2017సెప్టెంబర్‌లో పనులు ప్రారంభం... 2019 మే నాటికి పూర్తి... క్లుప్తంగా చెప్పాలంటే జడ్చర్ల – కోదాడ హైవే నిర్మాణ పనుల పరిస్థితి ఇది... కానీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎన్ని ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తారో, భూ సేకరణ ఎలా ఉండబోతుంది... దానికి నష్టపరిహారం ఎంత చెల్లిస్తారు... ఎన్ని కమర్షియల్ దుకాణాలు తొలగించాల్సి ఉంది.. అనే విషయాలపై హైవేలో ఉన్న కమర్షియల్ దుకాణదారుల్లో గుబులుగా ఉంది.. ఇప్పటికే జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి పనులు ఆరు భాగాలుగా విభజించి టెండర్లను పిలవగా జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు చేపట్టే పనులు ప్రారంభమయ్యాయి.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న జడ్చర్ల – కోదాడ హైవే విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులను ఆరు భాగాలుగా విభజించగా సుమారు 250 కి.మీ. మేర జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణ జరగనుంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి, కల్వకుర్తి నుంచి చారగొండ, చారగొండ నుంచి మల్లేపల్లి, మల్లేపల్లి నుంచి హాలియా, హాలియా నుంచి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుంచి కోదాడ వరకు ఆరు పనులుగా విభజించారు. ఈ పనుల్లో ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు విభజించిన మూడు పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు నిర్మించే రోడ్డు పనులను అనూష ప్రాజెక్టు రూ.200 కోట్లకు దక్కించుకోగా, కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు ఎస్.ఆర్.కె. కంపెనీ రూ. 171కోట్లకు చేజిక్కించుకుంది.
నాలుగు రోడ్లు.. వంద ఫీట్లు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) మొదట 150 ఫీట్ల మేర రోడ్డును విస్తరించాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేవలం 100 ఫీట్లు విస్తరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకే పనులకు మంజూరు అనుమతి వచ్చింది. మొత్తం 240 కి.మీ. మేర సాగే ఈ రోడ్డు పనులు మొత్తం 100 ఫీట్లు మాత్రమే విస్తరిస్తారు. కాగా పట్టణాల్లో మాత్రం రోడ్డుకు ఇరువైపులా కలిపి 80 ఫీట్లు రోడ్డును, రెండు వైపులా డ్రెయినేజీలు 10 ఫీట్లు, రెండు వైపులా ఫుట్‌పాత్‌లు కలిపి 10 ఫీట్ల చొప్పున విస్తరణ చేపడతారు. ఈ పనులను పూర్తి చేసే కాంట్రాక్టర్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు రోడ్డు పనులు విస్తరించిన పిదప ట్రాఫిక్, ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రోడ్లను విస్తరించే అవకాశాలుంటాయి. ఇప్పటి వరకు ఈ పనులకు సంబంధించి భూ సేకరణ , ఔటర్‌లు కానీ ఎక్కడ చేపట్టే అవకాశాలు లేవు.
కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 చెట్ల తొలగింపు
ఇప్పటికే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతుండగా కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 భారీ చెట్లను సంబంధిత కాంట్రాక్టర్లు తొలగించారు. ఆ చెట్లు వందల సంవత్సరాల నాటివి. ఇందులో వేప, రావి, మర్రి లాంటి పెద్ద వృక్షాలున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం తొలగించిన చెట్లకు బదులు, ఐదింతల రెట్లు మొక్కలను నాటి కొంతకాలం పాటు వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే రోడ్లపై వంద ఫీట్ల మేర నిర్మించే పనుల్లో భాగంగా కమర్షియల్ దుకాణాలు తమ సెల్లార్లను ముందుకు నిర్మించిన వాటికి ఎలాంటి నష్టపరిహారం లేకుండానే వాటిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపడుతారు. కేవలం ఒక్క దేవరకొండ పట్టణంలోనే వంద ఫీట్ల మేరకు నిబంధనలు అతిక్రమించి వందకుపైగా కమర్షియల్ దుకా>ణాలకు ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించాలని నోటీసులు ఇచ్చారు. అయితే రోడ్డు అలైన్‌మెంట్ అంతా పూర్తయ్యాక రోడ్డు మూలమలుపులు ఉన్న చోట సరిచేసే అవసరం వస్తే అందుకు సంబంధించి రైతుల భూములను ఎన్‌హెచ్‌ఏఐ కొనుగోలు చేస్తుంది. వాటికి నష్టపరిహారం కూడా అందిస్తారు. కాగా భూ సేకరణను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, ఆర్టీఓ సమక్షంలో పూర్తి చేస్తారు.
2019 మే నాటికి పూర్తి
2019 సంవత్సరం మే నాటికి జడ్చర్ల నుంచి కోదాడ వరకు పూర్తిగా రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు చేపట్టబోయే పనులకు త్వరలోనే టెండర్లు పూర్తవనున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రయాణికులకు, ట్రాన్స్‌పోర్టేషన్ భారంతోపాటు దూర భారం తగ్గుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే హైదరాబాద్ వరకు 200 కి.మీ. ప్రయాణించి శంషాబాద్ మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వంద కి.మీ. మేర ప్రయాణ భారం పెరుగుతుండగా కోదాడ నుంచి జడ్చర్ల హైవే పూర్తయితే ఈ దూర భారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment