
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి ఫైర్ అయ్యారు. విపక్షాలనుద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అత్యంత హేయంగా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆక్షేపించారు. ‘‘రాజకీయాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అబద్ధాలు మాట్లాడితే, ఆచరణసాధ్యం కాని విషయాలు చెబితే, ‘నువ్వేమన్నా కేసీఆర్‌వా?’అంటూ అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్! ఇలా దిగిజారి మాట్లాడి ఇంకా ప్రజల అసహ్యానికి గురి కావొద్దు’అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్నారు. అధికారం శాశ్వతం కాదంటూ హితవు పలికారు. విర్రవీగి మాట్లాడొద్దని హెచ్చరించారు. ‘‘కోదండరాంను నమ్మడం వల్లే కాంగ్రెస్ పరిస్థితి ఇలా అయిందని కేసీఆర్ అంటున్నడు. కానీ నిజానికి కేసీఆర్‌ను నమ్మడం వల్లే మా పరిస్థితి ఇలా అయింది’’ అంటూ వ్యాఖ్యానించారు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి శనివారం జానా విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ మాటలు వింటుంటే కలతతో, కలవరపడి, భయపడి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయన్నారు. మంచిచెడులను గమనించడానికి ప్రజలున్నారని, దేవుడున్నాడని హెచ్చరించారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌కు తనతో మాట్లాడే సత్తా గానీ, శక్తి గానీ ఆనాడు లేవని జానా అన్నారు. ‘‘ఉద్యమ సందర్భంగా నాతో కేసీఆర్ ఏమేమి మాట్లాడినాడో చెప్పడానికి ఆత్మాభిమానం అడ్డొస్తున్నది. జేఏసీ ఏర్పాటు సందర్భంగా జరిగిన చర్చలను ప్రజలకు వివరించడానికి త్వరలోనే బహిరంగ లేఖ రాస్తా. అది చదివాక ఎవరెలాంటివారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
జేఏసీ ఏర్పాటు సమయంలో ఎవరేం మాట్లాడారో చెప్పాలనుకుంటే సీఎం కేసీఆర్, నేను బహిరంగంగా మాట్లాడుకుంటే అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి’’ అని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన నెహ్రూను, ఇందిరాగాంధీని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని కేసీఆర్ తిట్టిన తీరును ప్రజలు గమనిస్తున్నారని జానా హెచ్చరించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతల గురించి హీనంగా మాట్లాడటం సరికాదన్నారు. జేఏసీ చైర్మన్‌గా కోదండరామ్ పేరును కేసీఆర్ ప్రతిపాదిస్తే తాను బలపర్చానని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కోదండరామ్ రాశారంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, వీటిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కోదండరామ్ ఎప్పుడూ కాంగ్రెస్‌కు అనుకూల వ్యక్తి కాడన్నారు.
నీతిమాలినతనం నా జీవితంలో లేదు: జానా
బ్లాక్ మెయిల్ రాజకీయాలు, నీతి మాలినమాటలు తన జీవితంలో లేవని జానా అన్నారు. ‘‘నేనెన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. ఎవరినీ ఎమ్మెల్యే టికెట్ కూడా అడగలేదు. టీడీపీని వీడినప్పుడు పొలిట్‌బ్యూరోకు, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశా. తెలంగాణ కోసమే వేదిక ఏర్పాటు చేశా తప్ప పదవుల కోసం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కృషి వల్లనే తెలంగాణ వచ్చింది. మేం అప్పుడే రాజీనామా చేసి ఉంటే, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదనే ఆలోచనకు మా అధిస్టానం వచ్చేది.
కాంగ్రెస్‌లో ఉంటూ పోరాటం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం వచ్చాక కూడా మేం అవమానాలను భరిస్తున్నాం’’అన్నారు. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. సకల జనులు పోరాడి తెలంగాణ సాధించుకున్నారన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో చిల్లర పార్టీలే టోకు పార్టీలయిన సందర్భాలున్నాయి. టోకు పార్టీలు చిల్లర పార్టీలయిన సందర్భమూ ఉంది. టోకు పార్టీ అనుకుంటున్నప్పుడు చిల్లర మాటలు మాట్లాడకుంటే మంచిది’’అని సూచించారు.
ఆ భాష మాకూ వచ్చు: భట్టి
జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని మల్లు హెచ్చరించారు. ‘‘జానాను వాడు వీడంటూ మాట్లాడటం దుర్మార్గం. కేసీఆర్ భాష అందరికీ వచ్చు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదనే ఆగుతున్నాం. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం’’అని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు గెలుపే కాదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, డబ్బు, వెండి గ్లాసులు పంచినా ఓట్ల తేడా కేవలం 4,000 మాత్రమేనన్నారు.
జానారెడ్డిని పెద్దలు అంటూ సంబోధించిన కేసీఆర్ ఇప్పుడు దొంగ అంటున్నారంటే వినాశకాలే విపరీత బుద్ధి అని పొంగులేటి అన్నారు. కేసీఆర్ కులమే తెలంగాణ తెచ్చిందని మాట్లాడటం గర్వానికి, అహంకారానికి పరాకాష్ట అన్నారు. కోదండరాంపై, కాంగ్రెస్ నేతలపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న కేసీఆర్ నమ్మకద్రోహి అని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. ఉద్యమంలో కోదండరాంను వాడుకుని, ఇప్పుడు వాడువీడు అని తిట్టడం కేసీఆర్ ద్రోహానికి నిదర్శనం. సీఎం మాట్లాడాల్సిన భాష ఇదేనా? ఆయన మెదడు చెడినట్టుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ దొరేఅయితే దేశం కోసం సరిహద్దులో పోరాడేవాడు కాదు. కేసీఆర్‌వే దొర లక్షణాలు’’ అంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment