
జిల్లాకు..మరో ముఖ్యపదవి
సాక్షిప్రతినిధి, నల్లగొండ :పదేళ్లపాటు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. దీంతో ఆ పార్టీ నాయకత్వం కుంగిపోయింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడాన్ని జీర్ణించుకోలేక పోయింది. అయితే సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డికి సీఎల్పీ పదవి దక్కడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కొంతలో కొంత సంతృప్తిగా ఉన్నాయి. కాగా జానారెడ్డి ఓ దశలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో నిలిచారు. ఆయన ఎన్నికల ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులోనూ ముందు వరుస లోనే నిలిచారు. కానీ, చివరి క్షణంలో ఏఐసీసీ నాయకత్వం జానారెడ్డిని కాదని పొన్నాలవైపు మొగ్గుచూపడంతో ఆయనకు అవకాశం దక్కకుండా పోయింది. మెజారిటీ స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే జానారెడ్డి ముఖ్యమంత్రి పదవికి గట్టి అభ్యర్థిగా ఉండేవారు.
కానీ, పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో, కేబినెట్ హోదా ఉండే శాసనసభా పక్ష నేత పదవిపై దృష్టి పెట్టి, ఆ మేరకు విజయం సాధించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు జానారెడ్డి వైపు మొగ్గు చూపడంతో ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. వాస్తవానికి ఇప్పటికే జిల్లా నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. దీంతో ఒకే జిల్లాకు రెండు కీలకమైన పదవులు ఇస్తారా? ఇవ్వరా? అన్న చర్చ జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం సీఎల్పీ నేత పదవి కోసం ప్రయత్నించారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక, బయటి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు డీకే అరుణ, మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డిలు సైతం సీఎల్పీ నేత పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్నా, పార్టీలో సీనియర్ నేత, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన (సమైక్య రాష్ట్రంలో) రికార్డు, అనుభవం ఉన్న జానారెడ్డి వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గుచూపింది. దీంతో అంతా ఊహించినట్లుగానే సీఎల్పీ నేతగా ఆయనను ప్రకటించింది.
గురుతర బాధ్యతే..
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్‌ను ఒక విధంగా ముందుండి నడిపించిన జానారెడ్డి.. రాజకీయ జేఏసీ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమానికి నాయకత్వం వహించారు. సొంత ప్రభుత్వంపై కూడా ఆయన లేఖాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని ప్రభుత్వాధినేతలకు వివరించడంలో గతంలోనే పేరు పొందారు. ఇపుడు తెలంగాణ నూతన రాష్ట్రంలో, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకునే వివిధ ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ నవనిర్మాణం తదితర అంశాలపై ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ దశలో ఎంతో ‘బ్యాలెన్స్ ’గా ఉంటారనే పేరున్న జానారెడ్డికి సీఎల్పీ పదవి దక్కడంతో ఆయనవర్గీయులు , జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.