
‘తూతూగానా?.. మాట్లాడే చాన్స్ ఇవ్వరా!’
హైదరాబాద్: తూతూ మంత్రంగా తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మిర్చీ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని జనారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయింది. పది నిమిషాల్లోనే బిల్లుపై చర్చ జరగకుండానే బిల్లుకు ఆమోదం తెలిపి సభను నిరవధిక వాయిదా వేసింది.
దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు స్పందించారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను సీఎం చిన్నగా చేసి మాట్లాడుతున్నారని అన్నారు. మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయని చెప్పారు. రూ.1000కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై తమ పోరాటం ఆగదని చెప్పారు.
త్వరలో రాష్ట్రపతిని కలిసి బిల్లును ఆమోదించొద్దని రాష్ట్రపతిని కోరతామన్నారు. అలాగే, కోదండరాం మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని యధావిధిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సవరణ బిల్లును కేంద్రం ఆమోదించకూడదని కోరారు. త్వరలో భూ నిర్వాసితులను కలుస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.