జ్యువెలరీ షాపులో చోరీ
- 39 కిలోల వెండి ఆభరణాల అపహరణ
ఉప్పల్: గ్రిల్స్ తొలగించి బంగారు, వస్త్ర దుకాణం లోపలికి చొరబడ్డ దుండగులు 39 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ కథనం మేరకు... రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట రాజేష్ వస్త్ర, బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 10.30కి షోరూం మూసివేసి ఇళ్లకు వెళ్లారు.
బుధవారం ఉదయం రాజేష్, సిబ్బంది దుకాణం తెరిచి చూడగా.. క్యాష్ కౌంటర్ తెరచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న బంగారు నగల కౌంటర్ గ్రిల్స్ తొలగిం చి ఉన్నాయి. దీంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్వాల్ జోన్ డీసీపీ కె.కోటేశ్వరరావు, ఏసీపీ జి.ప్రకాశరావు, ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చినా అది రెండు ఫ్లోర్లలోనే తిరగడంతో ఫలితం లేకపోయింది.
నిచ్చెన సహాయంతో..
షోరూం పక్క భవనంపై నుంచి నిచ్చెన సాయంతో దొంగలు షోరూం 3వ అంతస్తులోకి చొరబడ్డారు. మెట్లగుండా రెండో అంతస్తులోకి వచ్చి.. అక్కడ ఎనిమిది ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న వెండి నగలను మూటగట్టుకుని బంగారు నగల లాకర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న కొంత నగదును కూడా ఎత్తుకుపోయారు. కాగా, రెండేళ్ల క్రితం కూడా ఈ దుకాణంలో చోరీ జరిగినా యాజమాన్యం తగిన భద్రత చర్యలు తీసుకోలేదు.
చోరీ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ విషయమై ఫిర్యాదు చేసేందుకు షోరూం యాజమాన్యం రాత్రి 8 గంటల వరకు మీనమేషాలు లెక్క పెట్టడం కూడా వాటికి బలం చేకూరుస్తోంది. తొలుత నాలుగు కిలోల వెండి మాత్రమే చోరీ అయినట్లు తెలిపిన యాజమాన్యం, ఫిర్యాదులో మాత్రం 39 కిలోల వెండి, కొంత నగదు చోరీ అయినట్లు పేర్కొనడం గమనార్హం.