Pooja Silks
-
నమ్మించి..నట్టేట ముంచారు
కుషాయిగూడ : లక్కీ డ్రా పేరుతో తమను మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు రాధిక చౌరస్తా లోని పూజ సిల్క్స్ ఎదుట ఆందోళన దిగిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. పదేళ్లుగా రాధిక చౌరస్తాలో పూజ సిల్క్స్ అండ్ జ్యూవెలర్స్ పేరుతో బట్టలు, నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెండి ఆభరణాలపై లక్కీ డ్రా పథకాన్ని ప్రవేశ పెట్టారు. వినియోగదారులు ప్రతి నెల రూ. 100 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించేలా పలు స్కీంలను ఏర్పాటు చేశారు. ప్రతి నెల డ్రాలో గెలుపొందిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి స్కీంను బట్టి బహుమతి అందజేస్తారు. వివిధ స్కీంలలో సమారు 5 వేల మందికి పైగా వినియోగదారులు రూ.కోటికి పైగా డబ్బులు చెల్లించారు. అయితే ఇటీవల భాగస్వాముల మధ్య విబేధాల కారణంగా షాపు సక్రమంగా తెరవక పోగా, వెండి ఆభరణాలను షో రూంలోంచి తీసివేశారు. దీంతో అనుమానం వచ్చిన ఏజెంట్లు షాపు నిర్వాహకులను నిలదీయగమేగాక డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు తెలియడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు షాపు వద్దకు చేరుకున్నారు. అయితే షాపు తెరవక పోవడంతో అక్కడే బైఠాయించి న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షోరూం యజమానులతో చర్చించగా, ఇప్పటికే దాదాపు రూ.60 లక్షలు చెల్లించాలమని, మరో రూ.40 లక్షల చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్దిరోజుల్లోనే అందరి డబ్బులు చెల్లిస్తామని చెప్పగా బాధితులు నిరాకరించారు. దీంతో వారికి రావాల్సిన డబ్బులకు బదులుగా షోరూంలో బట్టలు, వస్తువులు ఇచ్చేలా అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. -
చట్టం.. గిట్టం జాన్తానై!
జ్యువెలరీ షాప్‌లో చోరీ జరిగింది రూ.16 లక్షలు ఎఫ్ఐఆర్లో రూ.3 లక్షలే చూపిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. అయితే, చట్టం.. గిట్టం జాన్తానై అంటున్నారు కుషాయిగూడ పోలీ సులు. జ్యువెలరీ షాప్ చోరీ విషయంలో బాధితుడు రూ.16 లక్షల సొత్తు పోయిం దని ఫిర్యాదు చేస్తే కాదు.. కాదు రూ.3 లక్షల సొత్తే పోయిందంటూ ఎఫ్ఐఆర్ చేశారు. దుకాణంలో సొత్తు ఎంత ఉంది? ఎంత పోయిందనే వివరాలను సాక్ష్యాలతో సహా బాధితుడు అందజేసినా పోలీ సులు మాత్రం తాము చెప్పిందే వేదం అనే రీతిలో వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలివీ... కుషాయిగూడకు చెందిన రాజేష్ స్థానిక రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట వస్త్ర, బంగారు నగల షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇతని షాప్‌లో దొంగలు చొరబడిరూ.16 లక్షల విలువైన 38 కిలోల వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు ఎత్తుకెళ్లారు. రాజేష్ తన ఫిర్యాదులో చోరీకి ముందు తన దుకాణంలో 78 కిలోల వెండి ఆభరణాలున్నాయని, ప్రస్తుతం 40 కిలోల వెండి మాత్రమే మిగిలిందని.. సుమారు 38 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని స్పష్టంగా పేర్కొన్నాడు. అయితే పోలీసులు పోయిన సొత్తుకు విలువ కట్టుకుండా కేవలం రూ.3 లక్షల విలువైన (7.5 కిలోల వెండి ఆభరణాలు) చోరీకి గురైనట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. చట్టప్రకారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేయాలి. ఫిర్యాదులోని అంశాలన్నీ నిజమా? కాదా అని నిర్ధారించుకోవాలి. బాధితుడు తప్పుడు ఫిర్యాదు చేశాడని తేలితే అతనిపై చర్యలు తీసుకునే వీలు ఉంది. అయితే పోలీసుల అలా చేయకుండా దర్యాప్తుకు ముందే ఒక నిర్దారణకు రావడం దురదృష్టకరం. దీంతో బాధితుడు నష్టపోయే అవకాశం ఉంది. రేపోమాపో దొంగలు దొరికితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సొత్తునే కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో బాధితుడు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. చోరీ అయిన సొత్తును తక్కువగా చూపించడం పోలీసులకు తగదు. చోరీ సొత్తుకు సంబంధించిన రసీదులన్నీ తమ వద్ద ఉన్నాయని బాధితుడు పేర్కొన్నాడు. పది తాళాలు-ఆరు డోర్లు..... జ్యువెలరీ షాప్‌లో చోరీకి పాల్పడిన దొంగలు పది పెద్ద తాళాలను, మూడు గ్రిల్ డోర్స్, రెండు ఐరన్ డోర్స్, ఒక కాడ్బోర్డ్ డోర్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇవన్నీ చేయడానికి కనీసం రెండు గంటలకు పైగానే పట్టింది. కాగా, బంగారు నగలు కలిగిన బీరువా తెరుచుకోకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. -
జ్యువెలరీ షాపులో చోరీ
39 కిలోల వెండి ఆభరణాల అపహరణ ఉప్పల్: గ్రిల్స్ తొలగించి బంగారు, వస్త్ర దుకాణం లోపలికి చొరబడ్డ దుండగులు 39 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకట రమణ కథనం మేరకు... రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట రాజేష్ వస్త్ర, బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 10.30కి షోరూం మూసివేసి ఇళ్లకు వెళ్లారు. బుధవారం ఉదయం రాజేష్, సిబ్బంది దుకాణం తెరిచి చూడగా.. క్యాష్ కౌంటర్ తెరచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న బంగారు నగల కౌంటర్ గ్రిల్స్ తొలగిం చి ఉన్నాయి. దీంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్వాల్ జోన్ డీసీపీ కె.కోటేశ్వరరావు, ఏసీపీ జి.ప్రకాశరావు, ఇన్స్పెక్టర్ వెంకట రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చినా అది రెండు ఫ్లోర్లలోనే తిరగడంతో ఫలితం లేకపోయింది. నిచ్చెన సహాయంతో.. షోరూం పక్క భవనంపై నుంచి నిచ్చెన సాయంతో దొంగలు షోరూం 3వ అంతస్తులోకి చొరబడ్డారు. మెట్లగుండా రెండో అంతస్తులోకి వచ్చి.. అక్కడ ఎనిమిది ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న వెండి నగలను మూటగట్టుకుని బంగారు నగల లాకర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. క్యాష్ కౌంటర్లో ఉన్న కొంత నగదును కూడా ఎత్తుకుపోయారు. కాగా, రెండేళ్ల క్రితం కూడా ఈ దుకాణంలో చోరీ జరిగినా యాజమాన్యం తగిన భద్రత చర్యలు తీసుకోలేదు. చోరీ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ విషయమై ఫిర్యాదు చేసేందుకు షోరూం యాజమాన్యం రాత్రి 8 గంటల వరకు మీనమేషాలు లెక్క పెట్టడం కూడా వాటికి బలం చేకూరుస్తోంది. తొలుత నాలుగు కిలోల వెండి మాత్రమే చోరీ అయినట్లు తెలిపిన యాజమాన్యం, ఫిర్యాదులో మాత్రం 39 కిలోల వెండి, కొంత నగదు చోరీ అయినట్లు పేర్కొనడం గమనార్హం.