- జ్యువెలరీ షాప్‌లో చోరీ జరిగింది రూ.16 లక్షలు
- ఎఫ్‌ఐఆర్‌లో రూ.3 లక్షలే చూపిన పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. అయితే, చట్టం.. గిట్టం జాన్తానై అంటున్నారు కుషాయిగూడ పోలీ సులు. జ్యువెలరీ షాప్ చోరీ విషయంలో బాధితుడు రూ.16 లక్షల సొత్తు పోయిం దని ఫిర్యాదు చేస్తే కాదు.. కాదు రూ.3 లక్షల సొత్తే పోయిందంటూ ఎఫ్‌ఐఆర్ చేశారు. దుకాణంలో సొత్తు ఎంత ఉంది? ఎంత పోయిందనే వివరాలను సాక్ష్యాలతో సహా బాధితుడు అందజేసినా పోలీ సులు మాత్రం తాము చెప్పిందే వేదం అనే రీతిలో వ్యవహరించారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలివీ... కుషాయిగూడకు చెందిన రాజేష్ స్థానిక రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట వస్త్ర, బంగారు నగల షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇతని షాప్‌లో దొంగలు చొరబడిరూ.16 లక్షల విలువైన 38 కిలోల వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు ఎత్తుకెళ్లారు. రాజేష్ తన ఫిర్యాదులో చోరీకి ముందు తన దుకాణంలో 78 కిలోల వెండి ఆభరణాలున్నాయని, ప్రస్తుతం 40 కిలోల వెండి మాత్రమే మిగిలిందని.. సుమారు 38 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని స్పష్టంగా పేర్కొన్నాడు.
అయితే పోలీసులు పోయిన సొత్తుకు విలువ కట్టుకుండా కేవలం రూ.3 లక్షల విలువైన (7.5 కిలోల వెండి ఆభరణాలు) చోరీకి గురైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. చట్టప్రకారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేయాలి. ఫిర్యాదులోని అంశాలన్నీ నిజమా? కాదా అని నిర్ధారించుకోవాలి. బాధితుడు తప్పుడు ఫిర్యాదు చేశాడని తేలితే అతనిపై చర్యలు తీసుకునే వీలు ఉంది.
అయితే పోలీసుల అలా చేయకుండా దర్యాప్తుకు ముందే ఒక నిర్దారణకు రావడం దురదృష్టకరం. దీంతో బాధితుడు నష్టపోయే అవకాశం ఉంది. రేపోమాపో దొంగలు దొరికితే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సొత్తునే కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో బాధితుడు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. చోరీ అయిన సొత్తును తక్కువగా చూపించడం పోలీసులకు తగదు. చోరీ సొత్తుకు సంబంధించిన రసీదులన్నీ తమ వద్ద ఉన్నాయని బాధితుడు పేర్కొన్నాడు.
పది తాళాలు-ఆరు డోర్లు.....
జ్యువెలరీ షాప్‌లో చోరీకి పాల్పడిన దొంగలు పది పెద్ద తాళాలను, మూడు గ్రిల్ డోర్స్, రెండు ఐరన్ డోర్స్, ఒక కాడ్‌బోర్డ్ డోర్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇవన్నీ చేయడానికి కనీసం రెండు గంటలకు పైగానే పట్టింది. కాగా, బంగారు నగలు కలిగిన బీరువా తెరుచుకోకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది.