చా(చో)ర్ సిస్టర్స్...! | Jewellery shops in six-handed | Sakshi
Sakshi News home page

చా(చో)ర్ సిస్టర్స్...!

Published Thu, Oct 23 2014 12:12 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

చా(చో)ర్ సిస్టర్స్...! - Sakshi

చా(చో)ర్ సిస్టర్స్...!

  • ఏడాదిలో ఆరు జ్యువెలరీ షాపుల్లో చేతివాటం
  •  28.5 తులాల బంగారం రికవరీ
  • సాక్షి, సిటీబ్యూరో:  ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు. జ్యువెలరీ షాపు సిబ్బంది దృష్టి మళ్లించి అందినకాడికి కాజేయడం వీరి వృత్తి. ఇందుకు భర్తల అండదండలు కూడా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ ముఠా ఆరు నగల దుకాణాల్లో రూ.9.26 లక్షల విలువైన 28.5 తులాల బంగారు నగలు దోచుకుంది.  వెస్ట్‌జోన్ పోలీసులు ఈ చా(చో)ర్ సిస్టర్స్‌తో పాటు ఇద్దరు భర్తను అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు.  డీసీపీ సత్యనారాయణ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం...
     
    చిలకలగూడకు చెందిన జుబేదాబేగం (25), తాహేరాబేగం (27), ఫరీదా (24), సాబేరాబేగం (29) అక్కాచెల్లెళ్లు. జుబేదాబేగం భర్త మహ్మద్ హనీఫ్ (30), ఫరీదా భర్త మహ్మద్ అజహర్ (25)ఆటో డ్రైవర్లు. ఆరుగురూ ముఠాగా ఏర్పడ్డారు.  వినియోగదారుల ముసుగులో నగల దుకాణాలకు వెళ్లి.. అక్కడి సేల్స్‌మన్స్, సెక్యూరిటీ సిబ్బం ది దృష్టి మళ్లించి నగలు చోరీ చేయడం తో ఈ నలుగురు అక్కాచెల్లెళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ‘పని’ పూర్తయ్యాక షాపు బయట ఆటోతో  సిద్ధంగా ఉండే భర్తలతో కలిసి పారిపోతుంటారు.
     
    ఇలా పట్టుబడ్డారు....

    ఈనెల 2న ఈ ముఠా హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని మెహిదీపట్నంలో ఉన్న సత్యనారాయణ జ్యవెలరీ షాప్‌లో  8 బంగారు గోలుసులను కాజేసింది. ఈ ముఠా చోరీ చేసినప్పటి దృష్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాజు కెమెరా ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించి, అందులో బురఖాలు ధరించి ఉన్న నలుగురు మహిళా నిందితులను గుర్తించారు.

    బుధవారం మెహిదీపట్నం రైతు బజార్ వద్ద ఈ ముఠాను పట్టుకున్నారు. విచారణలో పంజగుట్ట ఠాణా పరిధిలోని ఖజానా జ్యువెలరీస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్, త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జ్యువెలరీస్‌షాప్, మీర్‌చౌక్ ఠాణా పరిధిలోని సత్యనారాయణ జ్యువెలరీ షాప్, హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని సత్యనారాయణ జ్యువెలరీ షాప్, మహ్మద్ అక్బర్ జ్యువెలరీ షాపుల్లో  చోరీలక పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  సమావేశంలో అదనపు డీసీపీ కేఆర్ నాగరాజు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, డీఐ జి.రాజు, డీఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
     
    ఇద్దరు స్నాచర్ల అరెస్టు....


    ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్స్ పాల్పడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను హుమాయున్‌నగర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.30 లక్షల విలువైన 8.2 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సత్యనారాయణ కథనం ప్రకారం...ఫస్ట్‌లాన్సర్‌కు చెంది న మహ్మద్ అబ్దుల్ గఫర్ (25), రాజేం ద్రనగర్‌కు చెందిన మహ్మద్ మెహరాజ్ (38) ఆటో డ్రైవర్లు. జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరూ ఈజీమనీ కోసం స్నాచింగ్‌లు  ప్రారంభించారు. గతంలో 14 ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లారు.

    రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలైన వీరు మళ్లీ పాతదందా ప్రారంభించారు. హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని విజయనగర్‌కాలనీ, మాసాబ్‌ట్యాంక్‌లలో నాలుగు స్నాచింగ్ లు చేశారు. వీరిద్దరినీ కూడా పోలీసులు బుధవారం అరెస్టు చేసి వారి నుంచి 8.2 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదుకు కమిషనర్‌కు సిఫారసు చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల నేరాలు తగ్గడంతో పాటు కేసు మిస్టరీ త్వరగా వీడుతుందని ఆయన ఈ సందర్భంగా వ్యాపారులకు డీసీపీ సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement