హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల వరకు పొడిగించింది. పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. గత యూపీఏ ప్రభుత్వం 2005-06లో ప్రవేశపెట్టిన ఈ పథకం గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోగా దీన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు పెంచింది. ‘సమీకృత గృహ, మురికివాడల అభివృద్ధి కార్యక్రమం’(ఐహెచ్‌ఎస్‌డీపీ), ‘పట్టణ పేదలకు కనీస సదుపాయాలు’(బీఎస్‌యూపీ) కార్యక్రమాలకు ఈ పెంపు వర్తించనుంది.
2005-12 మధ్య కాలంలో బీఎస్‌యూపీ కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,603.19 కోట్ల అంచనా వ్యయంతో 88,035 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 71,470 గృహాల నిర్మాణం పూర్తయింది. ఐహెచ్‌ఎస్‌డీపీ కింద రాష్ట్రంలోని పలు పట్టణాలకు రూ.140.46 కోట్ల అంచనా వ్యయంతో 11,664 గృహాలు మంజూరయ్యాయి. అందులో 9607 గృహాల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన గృహాల పనులు ఆగిపోయాయి. గత మార్చితో గడువు ముగిసిపోవడంతో కేంద్రం నుంచి నిధులు సైతం స్తంభించిపోయాయి. ఈ పథకం స్థానంలో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు సైతం ప్రారంభించడంతో వీటి నిర్మాణం కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
‘జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం’ గడువు పొడిగింపు
Published Tue, May 5 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement