సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల ప్రకటనలపై కసరత్తు మొదలైంది. ప్రాధాన్యత క్రమంలో తొలి విడతగా ఏయే పోస్టులకు ప్రకటనలు జారీ చేయాలి.. ఏయే పోస్టులు భర్తీ చేయాలి... అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. జూలై నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటికీ ఆర్థిక శాఖ వద్ద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 17,960 పోస్టులకు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. సీఎం ప్రకటనతో ఉద్యోగాల నియామకాల ఫైలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కొన్ని విభాగాలు ఇప్పటికీ ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపించలేదని..
తక్షణం భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను ఒకరోజు వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఇటీవలే అన్ని విభాగాల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గడిచిన వారం రోజుల్లో వివిధ విభాగాల నుంచి అందిన పోస్టుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు సీఎస్‌కు నివేదించాయి. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులెన్ని.. అంతకు దిగువ కేడర్ పోస్టులెన్ని ఉన్నాయో విడివిడిగా వర్గీకరించాలని సీఎస్ సూచించారు.
టీఎస్ పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్సీ, వివిధ శాఖల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన వివరాలన్నీ కేటగిరీల వారీగా అప్‌లోడ్ చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 25 వేల పోస్టుల వివరాలను సిద్ధం చేయాలని.. మరో సారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఉద్యోగ నియామకాల కసరత్తు
Published Wed, Jun 17 2015 2:19 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement
Advertisement