జోహార్.. సిద్ధయ్యా.. జోహార్ | .. .. Johar Johar siddhayya | Sakshi
Sakshi News home page

జోహార్.. సిద్ధయ్యా.. జోహార్

Published Thu, Apr 9 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

జోహార్.. సిద్ధయ్యా.. జోహార్

జోహార్.. సిద్ధయ్యా.. జోహార్

ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్ గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించిన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం ముగిశాయి.

  • బాదేపల్లిలో అంత్యక్రియలు
  •  నివాళులు అర్పించిన మంత్రులు
  •  గౌరవ వందనం సమర్పించిన డీజీపీ
  • సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్ గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించిన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. పట్టణ వీధుల గుండా సుమారు మూడుగంటల పాటు సాగింది. వేలాదిమంది వెంట రాగా బాదేపల్లి శివారు ఆలూరు రోడ్డులోని స్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. పోలీసు లాంఛనాలతో సిద్ధయ్య పార్థివదేహాన్ని ఖననం చేశారు.

    నల్లగొండ జిల్లా జానకిపురం వద్ద ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో సిద్ధయ్యకు బుల్లెట్లు తగిలాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మంగళవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచిన విషయం విదితమే. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మంగళవారం రాత్రి 11.15కు మృతదేహాన్ని బాదేపల్లిలోని సొంత ఇంటికి తరలించారు. ఎస్‌ఐ మృతదేహం చేరుకుందనే సమాచారంతో పెద్దఎత్తున జనం సిద్ధయ్య నివాసానికి చేరుకుని కన్నీటి సంద్రమయ్యారు. కుటుంబసభ్యులు, బాల్య మిత్రులు, సహచరులతో పాటు జనం ఎస్‌ఐ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
     
    తరలివచ్చిన మంత్రులు, నేతలు

    రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు బుధవారం ఉదయం సిద్ధయ్య పార్థివదేహానికి నివాళి అర్పించారు. కుటుం బసభ్యులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం కూడా నివాళి అర్పిం చింది. సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నేతలు మల్లు రవి, పొన్నాల లక్ష్మయృ్య, శ్రీధర్‌రావు తదితరులు కాంగ్రెస్ బృందంలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భీమయ్యగౌడ్, మాధవ య్య నివాళి అర్పించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎర్ర చంద్రశేఖర్ తదితరులు సిద్ధయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
     
    అధికారులు, పోలీసుల నివాళి

    డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్, మహబూబ్‌నగర్ ఎస్పీ విశ్వప్రసాద్, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి పోలీసు లాంఛనాలతో నివాళి అర్పించారు. అనంతరం సిద్ధయ్య కుటుంబసభ్యులను పరామర్శిం చారు. కలెక్టర్ టీకే శ్రీదేవి, ఆర్డీఓ హన్మంతరెడ్డి సిద్ధయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బాల్యం నుంచి సిద్ధయ్యతో చదువుకున్న మిత్రులు, ఎస్‌ఐ శిక్షణలో బ్యాచ్‌మేట్లు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం వద్దకు సిద్ధయ్య భార్య ధరణీశ రావడంతో స్థాని కులు కంటతడి పెట్టారు. సిద్ధయ్య త్యాగాన్ని కీర్తిస్తూ స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలు, యువకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement