- సాయం చేయలేమని చేతులెత్తేసిన సర్కారు
- ఈ ఏడాది పీజీ పరీక్షకూ అనర్హులే
సాక్షి, హైదరాబాద్: పట్టువిడుపులు లేకుండా గతేడాది అరవై రెండు రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు చిక్కుల్లో పడ్డారు. హైకోర్టు వద్దని వారించినా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నా.. వైద్య ఆరోగ్య మంత్రి, అధికారులు చర్చలకు ఆహ్వానించినా.. పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడమే కాకుండా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పీజీ పరీక్షలకు కూడా అనర్హులు కానున్నారు. మానవతా దృక్పథంతో సమ్మె కాలానికి మినహాయింపునిచ్చి సకాలంలో హౌస్ సర్జన్ కోర్సును పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు జూడాలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య విద్య సంచాలకులు డి.శ్రీనివాస్, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డితో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు.
జూడాలకు వెసులుబాటు ఇచ్చే మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వీరికి సాయం చేసే పరిస్థితి లేదని న్యాయ శాఖ చేతులెత్తేసింది. కేబినేట్‌లో చర్చించి ప్రత్యేకంగా జీవో జారీ చేయటం ద్వారా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, ఇలా చేస్తే హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో జూనియర్ డాక్టర్లకు సాయం చేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని, తమ వైపు నుంచి ఏమీ చేసే పరిస్థితి లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మె చేసినంత కాలం కోర్సు పొడిగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో మార్చి 31న పూర్తి కావాల్సిన జూడాల హౌస్ సర్జన్ కోర్సు మే నెలాఖరుకు పూర్తవుతుంది. దీంతో పాటు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెడికల్ పీజీ పరీక్షకు వీరు అనర్హులవుతారని అధికారులు తెలిపారు.