
సాక్షి, హైదరాబాద్: ‘స్త్రీ నిధి’వంటి కార్యక్రమాలతో తెలంగాణ మహిళా సంఘాలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీ నిధి బ్యాంకు నాలుగో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన జూపల్లి మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నియంత్రించే స్థాయికే కాకుండా, సామాజిక కార్యక్రమాల్లోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మహిళల చేత, మహిళల ద్వారా, మహిళల కోసం నడుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు ఎన్నో విజయాలను సాధిస్తోందని, ఇది దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శనీయంగా మారిందని తెలిపారు. స్త్రీ నిధి సహకార పరపతి సమాఖ్య ఆరేళ్లలోనే 18 లక్షల మంది సభ్యులతో 2.86 లక్షల గ్రూపులకు రూ.4,800 కోట్ల రుణాలు అందించే స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉత్తమ ప్రతిభ చూపిన పలువురిని సన్మానించారు. ఆధార్ ఆధారిత రుణ వితరణ యాప్‌ను, మహిళ సంఘాల ఆన్‌లైన్ అకౌంటింగ్ వెబ్‌సైట్‌ను జూపల్లి ఆవిష్కరించారు. స్త్రీ నిధి విజయగాథలు, జీవనోపాధి కోసం పాజెక్టు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి స్త్రీ నిధి అధ్యక్షురాలు అనిత అధ్యక్షత వహించగా.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, మెప్మా ఎండీ శ్రీదేవి, సెర్ప్ సీఈవో పౌసమీ బసు తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment