
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ బాలయోగి న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయగా, ఈ నెల 15 నుంచి ఆ రాజీనామా అమల్లోకి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈలోపే జస్టిస్ బాలయోగి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
రాజ్యాంగ పరమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామా సమర్పించినప్పుడు, అది ఫలానారోజు నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంటే, ఆలోపు రాజీనామాను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ నోటిఫికేషన్‌లో ఫలానా తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనకపోతే ఆ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని భావించాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి జస్టిస్ బాలయోగి రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొన్న నేపథ్యంలో ఆయన గడువులోపే తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన 2019 జనవరి 14న పదవీ విరమణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment