
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి స్వర్గీయ డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గొప్ప మానవతామూర్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కొనియాడారు. పున్నయ్య తన జీవితాన్ని విలువలతో కూడిన ప్రజాసేవకే అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభా నిర్వహణ కమిటీ– హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె.రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పున్నయ్య హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ప్రగతిశీల తీర్పులను వెలువరించారని పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ.. శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మేధావిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ హోదాల్లో పనిచేసి పున్నయ్య తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారని కొనియాడారు. పున్నయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పున్నయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బి.దానం, డాక్టర్ బి.ప్రసాదరావు, డాక్టర్ ఎ.విద్యాసాగర్, టి.వి.దేవదత్, సుంకపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment