Rama Swamy
-
ముగిసిన జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు
హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) అంత్యక్రియలు శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. నగరంలోని రామస్వామి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానం వరకు ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఆయన కుమారుడు శ్రీనివాస్ మహాప్రస్థానంలోని విద్యుత్ దహన వాటికలో తండ్రి భౌతిక కాయాన్ని దహనం చేశారు. అంతకుముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఆర్డీఓ చంద్రకళ, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ రామయ్య, జస్టిస్ రామస్వామి కూతుళ్లు జ్యోతి, డాక్టర్ జయ, బంధువులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
జస్టిస్ కె.రామస్వామి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా ముగ్గరు పిల్లలున్నారు. భార్య శ్యామలాదేవి గతంలోనే కన్నుమూశారు. కుమారుడు శ్రీనివాస్ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మొదటి కుమార్తె జ్యోతి న్యూయార్క్‌లో ఎస్బీఐ ఏజీఎంగా... రెండో కుమార్తె జయ ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. న్యాయమూర్తుల సంతాపం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ రిటైర్డ్ జస్టిస్ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు. న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రచౌహన్, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ అమర్నాథ్గౌడ్, సుప్రీంకోర్టు జస్టిస్ సయ్యద్ షా మహ్మద్ ఖాద్రీలు, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు కూడా జస్టిస్ రామస్వామి భౌతికాయం వద్ద నివాళులర్పించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి నైపుణ్యం సాధించిన ఆయన 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు.1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. -
జస్టిస్ కె.పున్నయ్య జీవితం ఆదర్శప్రాయం
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి స్వర్గీయ డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గొప్ప మానవతామూర్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కొనియాడారు. పున్నయ్య తన జీవితాన్ని విలువలతో కూడిన ప్రజాసేవకే అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభా నిర్వహణ కమిటీ– హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె.రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పున్నయ్య హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ప్రగతిశీల తీర్పులను వెలువరించారని పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ.. శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మేధావిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ హోదాల్లో పనిచేసి పున్నయ్య తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారని కొనియాడారు. పున్నయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పున్నయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బి.దానం, డాక్టర్ బి.ప్రసాదరావు, డాక్టర్ ఎ.విద్యాసాగర్, టి.వి.దేవదత్, సుంకపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
శశికళ పుష్ప పెళ్లి జరిగేనా?
టీ.నగర్: అన్నాడీఎంకే నుంచి తొలగించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (41) తన భర్త లింగేశ్వర తిలకన్‌తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఆయనతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శశికళ పుష్ప ఢిల్లీలోగల ప్రభుత్వ బంగ్లాలో నివశిస్తున్నారు. ఇలావుండగా శశికళ పుష్పకు, ఆమె వద్ద న్యాయ సలహాదారుగా ఉన్న రామస్వామికి ఈనెల 26న వివాహం జరగనున్నట్లు వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాఉండగా ఎంపీ శశికళ పుష్ప వివాహం చేసుకోనున్న రామస్వామి తనను మోసగించినట్లు యువతి సత్యప్రియ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత కన్నీటితో విలేకరులకు వివరాలు తెలిపింది. ఢిల్లీలో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న రామస్వామికి తనకు 2014లో వివాహం జరిగిందని, వరకట్నంగా 90 సవర్ల బంగారు నగలు, సారె ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీకి తీసుకువెళ్లి కుటుంబం నడిపిన రామస్వామి అదనపు కట్నం కోరుతూ వేధించాడని, తనను కోట్నం తేవాలని పుట్టింటికి పంపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం తనను మోసగించి రెండో వివాహానికి సిద్ధపడినట్లు తెలిపింది. ఈ వివాహాన్ని అడ్డుకుని తనను భర్తతో కలపాలని కోరింది. దీనిపై సత్యప్రియ ఇచ్చిన ఫిర్యాదును మదురై కలెక్టర్ వీరరాఘవరావు పోలీసు కమిషనర్‌కు పంపారు. ఆయన ఉత్తర్వుల మేరుకు పోలీసులు ఢిల్లీలో ఉన్న రామస్వామి వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. దీంతో వచ్చే 26న శశికళ పుష్ప పెళ్లి జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రామసామిపై కేసు:ఎంపీ శశికళ పుష్ప వ్యవహారంలో రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. భర్త మోసం గురించి మదురై లీగల్ సెల్లో సత్యప్రియ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన లీగల్ సెల్ రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడింది. -
రచ్చకెక్కిన వివాదాస్పద ఎంపీ పెళ్లి
టీ.నగర్: వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే వివాదాస్పద ఎంపీ శశికళ పుష్ప రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వీరి వివాహం ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామస్వామి మొదటి భార్య తెరమీదకు వచ్చారు. మదురై మహాలింగ పట్టికి చెందిన తనకు, రామస్వామితో 2014లో వివాహం జరిగిందని మంగళవారం విలేకర్లకు వెల్లడించింది. అందుకు తగిన ఆధారాలను, తన బిడ్డతో పాటు ఉన్న చిత్రాన్ని చూపింది. దీని గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నిజాయితీకి నిదర్శనం దామోదరం..
కర్నూలు(అర్బన్): నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిలిచారని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా కర్నూలులో శనివారం దామోదరం జయం తి వేడుకలను నిర్వహించింది. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, వై. ఐజయ్య, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రామస్వామి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కేక్ కట్ చేసి ప్రసంగించారు. దామోదరాన్ని యువత, రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు బోనస్ ప్రకటించి బోనస్ సంజీవయ్యగా కార్మికుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. భూ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చి 6 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయించారని చెప్పారు. బీసీ వసతి గృహాన్ని దత్తత తీసుకుంటా దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపునిచ్చారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటే ఎంతో మంది నిరుపేదలకు సేవ చేయవచ్చన్నారు. దామోదరం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. జిల్లాలోని ఒక ప్రభుత్వ బీసీ వసతి గహాన్ని దత్తత తీసుకొని దానిని ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. పెద్దపాడును దత్తత తీసుకుంటా: దామోదరం సంజీవయ్య స్వగ్రామమైన పెద్దపాడును తాను దత్తత తీసుకుంటానని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ సంఘాల నాయకులు దామోదరం రంగయ్య, టి షడ్రక్, వాడాల త్యాగరాజు, డీపీ స్వామన్న, జి నాగరాజు, ఎం స్వామి, వై జయరాజు, టి చిన్న లక్ష్మన్న, చిటికెల సలోమి, బాలసుందరం, వేల్పుల జ్యోతి, గడ్డం రామక్రిష్ణ, అనంతరత్నం మాదిగ, టి శేషఫణి, కైలాస్‌నాయక్, జే బాబురాజు, వెంకటేష్, టీపీ శీలన్న, లింగస్వామి, రాజ్‌కుమార్, పుల్లన్న తదితరులు ప్రసంగించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డీఓ రఘుబాబు, ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, డీఎంహెచ్‌వో నిరుపమ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పులిచేరి సారయ్య, డీఈవో సుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవి రామస్వామి
హన్మకొండ కల్చరల్: అబ్రకదబ్రా.. అంటూ ఆయన చేసే ఇంద్రజాల ప్రదర్శనలు అబ్బురపరిచేవి. సంబ్రమాశ్చర్యాలకు గురిచేసేవి. మ్యాజిక్కు కేరాఫ్‌గా నిలిచి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ ఇంద్రజాలికుడు కెమిడి రామస్వామి. జీవితాంతం ఇంద్రజాలాన్నే శ్వాసించిన రామస్వామి.. తుది శ్వాస విడిచిందీ కళావేదిక సమీపంలోనే. శుక్రవారం సాయంత్రం ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రామస్వామి. వేదిక దిగిన కొద్దినిమిషాల్లోనే గుండెపోటుతో కుప్పకూలడం అందరినీ కలచివేసింది. తండ్రి స్ఫూర్తితో.. జిల్లాలోని జనగామలో 1947 నవంబర్ 4న జన్మించారు రామస్వామి. బాల్యంలోనే తల్లి మరణించింది. తండ్రి మల్లయ్య మేజిక్ ప్రదర్శనలు రామస్వామిని ఆకట్టుకునేవి. అలా తండ్రి వద్దే అసిస్టెంట్‌గా చేరి తన ఆసక్తి.. పరిశీలన శక్తితో ఇంద్రజాలాన్ని ఔపోసన పట్టారు. స్వయంకృషితో క్రమక్రమంగా ఎదిగారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. దేశసేవలో.. పదహారేళ్ల ప్రాయంలో దేశసేవ చేయాలని ఆయన భావించారు. కానీ ఎత్తు తక్కువ కావడంతో మిలటరీలో ఎంపిక కాలేకపోయారు. 1964లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసులో చేరారు. 1965-66 పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఇంఫాల్, మణిపూర్ నాగాలాండ్, బర్మా సరిహద్దుల్లో ఏడాదిపాటు పోరుసల్పారు. తర్వాత వరంగల్ తిరిగి వచ్చారు. 1966లో పెళ్లి చేసుకున్నారు. 2005లో అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డయ్యారు. వెయ్యికి పైగా ప్రదర్శనలు 1979 మార్చి 11న ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ఓపి అగర్వాల్ వరంగల్‌లో ఇచ్చిన మ్యాజిక్ ప్రదర్శన రామస్వామిని ఆకర్షించింది. అదే ఏటా ఆగస్టు 7న పీసీ సర్కార్ జూనియర్ హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వగా రామస్వామి వెళ్లొచ్చారు. విశాఖపట్నంలోని అరిపాక సూరిబాబు వద్ద మేజిక్‌లో శిక్షణ పొందారు. 1986 మే 25న జగిత్యాలలో డాక్టర్ కేసినో ప్రదర్శన చూసి ఆయనకు శిష్యుడిగా చేరారు. వరంగల్‌లో డాక్టర్ కేసినో ప్రదర్శన ఇచ్చినప్పుడు వారం పాటు అసిస్టెంట్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో డాక్టర్ వాసూస్ వద్ద హిప్నాటిజంలో శిక్షణ పొందారు. 1993 డిసెంబర్ 2న మొదటిసారిగా మామునూరు క్యాంప్‌లో మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాతా పోలీసు క్యాంపులలోనే ఎక్కువసార్లు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చారు. అవార్డులు.. 1993 నవంబర్ 7న మంగపేటలోని నవభారత్ స్కూల్ వారు ఆయన్ను మైటీస్టార్ బిరుదుతో సత్కరించారు. 2012లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల ప్రదర్శన పోటీల్లో పాల్గొని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. గుంటూరులో జరిగిన పోలీసు స్కౌట్ మీట్స్ బంగారు పతకాన్ని పొందారు. నెక్కొండ కళారంజన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అద్భుతంగా ఇంద్రజాల ప్రదర్శన చేసి జాదూగర్ ప్రవీణ బిరుదాంకితుడయ్యారు. నటుడిగానూ.. ఇంద్రజాలికుడి, హిప్నాటిస్టుగానేకాక నటుడిగానూ రామస్వామి పేరు తెచ్చుకున్నారు. పలు టెలీఫిల్మ్ల్లో నటించారు. 2006లో పిల్లలుకాదు పిడుగులు, 2007లో ఇదీ ప్రేమంటే, రేపటి పౌరులు, 2008లో అడవిలో, 2011 ఆటమొదలైంది. 2011లో వైఎస్ మహాప్రస్థానం తదితర చిత్రాల్లో నటించారు. 2006లో మంచుముల్లు, సందేశం, 2007లో నాప్రేమ, 2009లో హారిక, స్నేహలత, మగువ తదితర టెలీఫిల్మలలో నటించారు.