పర్యావరణాన్ని పణంగా పెట్టొద్దు | Justice Swatthaar Kumar about World Environment Day | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని పణంగా పెట్టొద్దు

Published Wed, Jun 7 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

పర్యావరణాన్ని పణంగా పెట్టొద్దు

పర్యావరణాన్ని పణంగా పెట్టొద్దు

‘సాక్షి’తో ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: ‘‘పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలది, ప్రజల ది. వారి ఉమ్మడి కృషి మాత్రమే మున్ముందు రానున్న ఉపద్రవాల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. పర్యావరణానికి సంబంధించి ప్రజల కన్నా, పరిశ్రమల కన్నా రెండింతల అధిక బాధ్యత– జవాబుదారీతనం ప్రభుత్వానికి ఉంది.

ప్రభుత్వాలెంత బాధ్యతగా వ్యవహరించాలో పౌరులు, పౌర సంఘాలు అంత చేతనతో నడుచుకుంటేనే పర్యావరణాన్ని పరి రక్షించగలం’’ అని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) చైర్మన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చి న స్వతంతర్‌ కుమార్‌ మంగళవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రస్తుతం ఎన్జీటీలో విచారణ లో ఉన్న, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సం బంధించిన కేసుల విషయంలో తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేస్తూ.. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను తెలిపారు.

కొత్త చట్టాలు అవసరం లేదు..
పర్యావరణాన్ని కాపాడటమే కాక నిఘా–నియంత్రణ ప్రభుత్వ పరిధిలోదేనని, ఈ విషయంలో పౌరుల హక్కులకు–బాధ్యతలకు మధ్య గొప్ప సమతుల్యత సాధిస్తూనే ప్రభుత్వానికి బాధ్యత నిర్దేశించేలా, ప్రపంచంలో మరే దేశ రాజ్యాంగంలోనూ లేని ప్రత్యేకత మన దేశ రాజ్యాంగంలో ఉందని చెప్పారు. మన రాజ్యాంగ నిర్మాతల ముందు చూపు, దార్శనికత గొప్పదని అన్నారు.

పర్యావరణం తీవ్ర సంక్షోభాల్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, మన దేశంలో ఇప్పటికిప్పుడు కొత్త చట్టాల అవసరం లేదని, ఉన్న వాటిని సవ్యంగా అమలు చేయడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి, పౌరుల చైతన్యమే కీలకమని అన్నారు. ఇదే దిశలో ఎన్జీటీ న్యాయపరమైన ఒక కీలకాంగంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందన్నారు. ఎదిగే క్రమంలో ఎక్కడైనా అభివృద్ధి ఒక అత్యవసరమని, అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టకుండా పాలకులు జాగ్రత్త పడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో నష్టం జరిగాక చర్యల కన్నా, ముందుజాగ్రత్త నివారణ చర్యలే కీలకమన్నారు.

పౌరులే ఉల్లంఘిస్తే చాలా ప్రమాదం..
పర్యావరణ పరిరక్షణ చట్టాలు, నిబంధనల్ని పరిశ్రమో, ప్రభుత్వాలో ఉల్లంఘించినపుడు ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయస్థానాలు అడ్డుకుంటాయని స్వతంతర్‌ కుమార్‌ పేర్కొన్నారు. పౌరులే ఉల్లంఘనలకు పాల్పడితే ప్రభుత్వాలు నియంత్రించజాలవన్నారు. అక్రమ నిర్మాణాల్ని గుడ్డిగా కూల్చి పౌరుల్ని నష్టపరచలేమన్నారు. నష్టపరిహారం రాబడుతూ చేసే పర్యావరణ–పునరుద్ధరణ ప్రత్యామ్నాయ పరిష్కారమన్నారు. బిల్డర్లను నమ్మి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిని బాధ్యుల్ని చేయలేమన్నారు. బిల్డ ర్లనే బాధ్యుల్ని చేస్తూ వారి నుంచి నష్టపరి హారాన్ని రాబట్టే తీర్పులిచ్చామన్నారు.

విశ్వాసం కోల్పోతే అంతే సంగతులు..
పర్యావరణ పరిరక్షణలో పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలదీ కీలకపాత్రేనని, అవి సం దేహాస్పదంగా వ్యవహరించినా, విశ్వాసం కోల్పోయినా.. అంతిమంగా పర్యావరణానికి చెడు జరిగే ప్రమాదముందన్నారు. విచారణ ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో కొందరు ఫిర్యాదుదారులు తాము కేసును ఉపసంహరించుకుంటున్నామనడం విడ్డూరంగా ఉం టుందన్నారు. దీనికి ఎన్జీటీ అంగీకరించదన్నా రు. హరిత న్యాయస్థానాలు అన్ని స్థాయిల్లో పౌరులకు అందుబాటులోకి రావాలనే భావనకు తాము అనుకూలమని, మరిన్ని ఎన్జీటీ ప్రాంతీయ బెంచీలు రావడానికి, హైదరాబాద్‌లోనూ ఏర్పాటుకు సుముఖమేనని, కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇదీ పర్యావరణ త్రికోణం
‘‘భారత రాజ్యాంగ అధికరణం 14, 19, 21లో నిర్దేశించిన పౌరుల ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ద్వారా సమన్వయ పరిచింది. జీవించే హక్కు అంటే, ఊపిరికలిగి ప్రాణాలతో ఉండటం మాత్రమే కాదు, స్వచ్ఛమైన గాలి, నీరు, పరిశుభ్ర పరిసరాలు, ప్రకృతిని పొందుతూ ఒక సంపూర్ణ జీవనం అనుభవిస్తూ ఉండటం అని నిర్వచించింది. ఒకరు కోరడం, కోరకపోవడంతో నిమిత్తం లేకుండా రాజ్యం (ప్రభుత్వాలు) నిర్వహించాల్సిన రాజ్యాంగ విహిత బాధ్యతల్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు.

దాని ప్రకారం, అడవుల్ని, వన్యప్రాణుల్ని కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని అధికరణం 48ఎ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వానికి ఇదెంత బాధ్యతో, అదే రాజ్యాంగం నియోగించిన పౌర ప్రాథమిక బాధ్యతల్లో భాగంగా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించాల్సిన విధి పౌరులకూ ఉంది. అధికరణం 51ఎ(జి) ప్రకారం.. వన్యప్రాణులు, నదులు, చెరువులు, కుంటలు, అడవులతో సహా సహజ పర్యావరణాన్ని కాపాడుతూ వృద్ధి పరచడం, సకల జీవుల పట్లా దయతో ఉండటం పౌరుల బాధ్యత. అధికరణం 21 కింద లభించే జీవించే హక్కును అనుభవించడానికి పౌరుడు స్వీయ బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా, ప్రభుత్వాన్నీ తన బాధ్యత నిర్వహించమని డిమాండ్‌ చేయవచ్చు. ఇదే, తరచూ నేను నా ప్రసంగాల్లో చెప్పే పర్యావరణ త్రికోణం’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement