ఎందుకిలా జరుగుతోంది?
► ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస ఘటనలపై కేసీఆర్ దృష్టి
► కీలక నేతలు, ఉన్నతాధికారులను ఆరా తీసిన సీఎం
► ‘మంథని నుంచి అల్గునూరు’ వరకు వివరాల సేకరణ
► పరిశీలించి నివేదిక ఇవ్వాలని నిఘా వర్గాలకు ఆదేశం?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కొంతకాలంగా జరుగుతున్న ఘటనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించినట్లు తెలిసింది. అటు మంథని నుంచి ఇటు నేరెళ్ల, తాజాగా అల్గునూరు సంఘటనల వరకు వివాదాస్పదం కావడం, వాటిల్లో దళితుల అంశం ప్రధానంగా ఉండడంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. బడుగు, బలహీన, పేద వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్న తరుణంలో.. అలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్న కోణంలో జిల్లాకు చెందిన కీలక నేతలతో కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది. దీంతో సోమవారం ఈ అంశాలు టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కొంతకాలంగా వరుస ఘటనలు
కొద్దిరోజుల కింద మంథని ప్రాంతంలో దళిత యువకుడి ప్రేమ, ఆత్మహత్య వివాదం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పొలం వద్దకు వెళ్లి వస్తున్న దళిత దంపతులపై పోలీసుల దాడి కూడా వివా దాస్పదమైంది. ఇక నేరెళ్ల ఇసుక వివాదం, ఎనిమిది మందిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన సంఘటన వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకత్వాలను కరీంనగర్‌కు తరలేలా చేసింది. ఈ వివాదం సుమారు 25 రోజులపాటు రాష్ట్రాన్ని కుదిపింది. తాజాగా దళితులకు మూడెకరాల భూ పంపిణీలో దళారుల ప్రమేయం, డబ్బుల వసూలు, అనర్హులకు కేటాయింపుపై మనస్తాపానికి గురైన ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
బెజ్జెంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్, పర్శరాములు ఆదివారం సాయంత్రం అల్గునూరులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో ఈ ఘటనలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు కీలక ప్రజాప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగినట్లు సమాచారం. అంతేగాకుండా జిల్లాలోని నలుగురు ఉన్నతాధికారులతోనూ ఇదే అం శంపై మాట్లాడినట్లు తెలిసింది. అంతేగాకుండా ఆయా ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా నిఘా వర్గాలను సీఎం ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది.