
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా నిరుద్యోగులను నిరాశలోనే ఉంచిందని ఉద్యోగాల సాధన సమితి మండిపడింది. ఖాళీగా ఉన్న లక్షా ఏడు వేల ఉద్యోగాలను ఏడాది కాలంలో భర్తీ చేస్తానన్న ప్రభుత్వం కేవలం 20 వేల ఉద్యోగాలు కూడా `భర్తీ చేయలేదని పేర్కొంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాల సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ నేతృత్వంలో బుధవారం సదస్సు జరిగింది.
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరైన ఈ సదస్సులో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. సదస్సులో కొన్ని తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖాళీలన్నింటినీ విడతల వారీగా కాకుండా ఒకే సారి భర్తీ చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసుకోవడానికి పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం తేవాలన్నారు.
పబ్లిక్ ట్రైనింగ్ యాక్ట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని, మూతపడిన పరిశ్రమల్లో ఎందరు ఉద్యోగాలు కోల్పోయారు, ఇతర రంగంలో కొత్త ఉద్యోగాలు పొందినవారెందరో తెలపాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐటీ సెక్టార్‌లో ప్రతి ఏటా శిక్షణ ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని, టీఆర్టీ కోసం వాస్తవ ఖాళీల సంఖ్యను ప్రకటించాలని సమితి కోరింది.
Comments
Please login to add a commentAdd a comment