ముకరంపుర :
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో వామపక్ష పార్టీలు బుధవారం కలెక్టర్‌ను ముట్టడించాయి. జిల్లా నలుమూల నుంచి సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐయూ, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ సహా కార్యకర్తలు సర్కస్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నారాయణతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి జీపులో ఠాణాకు తరలిస్తుండగా కార్యకర్తలు వాహనానికి అడ్డు తగిలారు. బస్టాండ్ ఎదుట సీపీఐ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి అక్కడినుంచి వాహనాన్ని వన్‌టౌన్‌కు తరలించారు.
నారాయణతో పాటు నాయకులను జిల్లా కేంద్రంలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించగా, వారి అరెస్ట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు తిరిగి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ పరిణామాలతో వామపక్ష పార్టీల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
కేసీఆర్‌పై హత్య కేసు పెట్టాలి:
- కె.నారాయణ
కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి.. రైతుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పైన హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని, టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ..కేసీఆర్ మాయల మరాఠీ, మాటల ఫకీరు అంటూ ధ్వజమెత్తారు.
రైతు ఆత్మహత్యలను సర్కారు హత్యలుగా పరిగణించాలన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 356 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రుణమాఫీ చేయకుండా, కొత్త రుణాలివ్వకుండా, కరెంటు కోతలతో పంటలు ఎండబెట్టడం వల్లే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు. సర్కారు నిర్లక్ష్యంతోనే మరో మూడేళ్ల పాటు కరెంటు రాని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని, నిధులు కేటాయించి ఉంటే విద్యుత్ కొరత ఏర్పడి కాదన్నారు. పెన్షన్ కోసం సదరం క్యాంపులో నిలబడి ఓ వృద్ధుడు మరణించిన సంఘటన విషాదకరమన్నారు.
ఫాస్ట్ పేరుతో విద్యార్థుల చదువులకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శించారు. విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు అవసరమైతే రూ.వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ అని చెప్పి అనేక కొర్రీలు పెట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో చర్చించి సర్కారును దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి మాదన నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి, నాయకులు ముత్యం రవి, పంతం రవి, రమేశ్, సత్యం, శేఖర్, సంపత్, జ్యోతి, ఎంసీపీఐయూ నాయకులు లింగంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన ఎర్రదండు...
Published Thu, Nov 6 2014 4:17 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement
Advertisement