
డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులేశారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించి, ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. మంత్రివర్గంలో వివిధ మార్పుచేర్పులు కూడా చకచకా చేసేశారు. కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు.. ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లూ విద్యాశాఖను నిర్వర్తించిన జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ అప్పగించారు. ఇంతకుముందు రాజయ్య వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి ఇచ్చారు.
రాజయ్యను తప్పించాలన్న మంత్రివర్గ సిఫార్సును గవర్నర్ ఆమోదించడంతో రాజయ్య మంత్రిపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోయాయి. ఆ తర్వాత వెంటనే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చెప్పడంతో ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం కూడా చేయించేశారు. ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పుచేర్పులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కడియం శ్రీహరికే ఇచ్చారు.