తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి వెల్లడి
తూప్రాన్: రైలు ప్రమాదానికి కారణమైన మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ హైస్కూల్ యాజమాన్యంపై మెదక్ డిప్యూటీ డీఈఓ శామ్యూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్న విషయాన్ని చూసుకోకుండా ఈ స్కూల్ బస్సును డ్రైవర్ పట్టాలపైకి తీసుకెళ్లడంతో రైలు ఢీకొని 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా, మరో 20 మంది గాయపడిన విషయం విదితమే.
ఈ విషయమై డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సుకు 50 ఏళ్లు దాటిన వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నారని, అలాగే, బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు ఎవరూ లేరని డిప్యూటీ డీఈఓ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్-23 ప్రకారం ఐపీసీ 304ఎ, 337, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే, ప్రమాదానికి బాధ్యులైన పాఠశాల యాజమాన్యాన్ని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.
కాకతీయ హైస్కూల్ యాజమాన్యంపై కేసు
Published Sun, Jul 27 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement