సాక్షి, వరంగల్ అర్బన్ : కాకతీయ మెడికల్ కళాశాలలో గంజాయి కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం జూనియర్ విద్యార్థి బర్త్ డే పార్టీ సందర్భంగా 22 మంది విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న వారందరిని రెండు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
మొత్తం 30 మంది సదరు విద్యార్థి బర్త్ డే పార్టీకి వెళ్లగా 22 మంది గంజాయి దమ్ము కొట్టినట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న మెడికోలు అందరూ తెల్లవారే వరకూ నిద్ర మత్తులోనే ఉండటంతో సహచర విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. మత్తులో జోగుతున్న విద్యార్థుల విజువల్స్‌ను రికార్డ్ చేసిన వార్డెన్ ప్రిన్సిపాల్‌కు అందించడంతో వారిని రెండు నెలలపాటు సస్పెండ్ చేశారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విచారణ కమిటీని కళాశాల నియమించింది. సమాజానికి మంచి చెప్పాల్సిన మెడికోలే ఇలా గంజాయి మత్తులో జోగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో వరంగల్ నిట్ విద్యార్థులు కూడా గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెడికోలకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment