సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇన్నాళ్లూ దీనిని కొత్త ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం.. రాష్ట్రం ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెంది, కాళేశ్వరాన్ని నిర్మాణంలోని ప్రాజెక్టుగా పరిగణించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ గురువారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీకి లేఖ రాశారు. ఈ నెల 24న సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, జోషీలతో జరిపిన చర్చల అంశాన్ని ప్రస్తావిస్తూ...‘‘మన చర్చల అనంతరం నిర్ణయించిన మేరకు.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగానే పరిగణిస్తాం. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును విభజించి చేపట్టినదానిగానే కాళేశ్వరాన్ని పరిగణిస్తాం..’’ అని అందులో పేర్కొన్నారు.
మొర ఫలించినట్లే..!
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తొలి డిజైన్ మేరకు తగిన నీటి లభ్యత లేని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రీ డిజైనింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రాజెక్టును రెండుగా విభజించి అదనంగా కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టింది. కానీ దీనిపై అనేక వివాదాలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం కాళేశ్వరం పూర్తిగా అక్రమ ప్రాజెక్టు అంటూ కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసింది. దీంతో కేంద్రం, సీడబ్ల్యూసీ, బోర్డులు వివరణ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వివరాలు వెల్లడించింది. 160 టీఎంసీల వినియోగం లక్ష్యంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి, 2010లో కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించామని.. కేంద్రం పరిధిలోని వివిధ డైరెక్టరేట్‌ల నుంచి అనుమతులు కూడా పొందామని వివరించింది. అంతేగాకుండా ప్రాణహిత వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులోని రిజర్వాయర్ల సామర్థ్యం అనుకున్న మేర లేదంటూ సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలనూ అందజేసింది. మహారాష్ట్ర ముంపునకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తిందని తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా రీడిజైన్ చేశామని.. కాళేశ్వరం వద్ద అదనంగా ఎత్తిపోతలు చేపట్టామని స్పష్టం చేసింది. మొత్తంగా ఇది నిర్మాణంలోని ప్రాజెక్టే తప్ప కొత్త ప్రాజెక్టు కాదని వివరించింది. దీనిపై ఇటీవలి వరకూ సంప్రదింపులు జరుగుతూనే ఉండగా.. తాజాగా ఈ నెల 21న గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూడా జోషీ కాళేశ్వరం పాత ప్రాజెక్టే అనడానికి గల అన్ని రుజువులను సమర్పించారు. అనంతరం ఈ నెల 24న ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, జోషీలు కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌తో భేటీ అయి ప్రాజెక్టుపై వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన కేంద్రం కాళేశ్వరాన్ని నిర్మాణంలోని పాత ప్రాజెక్టుగానే పరిగణించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి దక్కాల్సిన సాంకేతిక, ఆర్థిక అనుమతులు సులభతరం కానున్నాయి.
ఈ నివేదికలు ఇవ్వాల్సిందే..
కాళేశ్వరాన్ని పాత ప్రాజెక్టుగా పరిగణిస్తామన్న అమర్‌జిత్.. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలపై తెలంగాణ ప్రభుత్వం వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి భూగర్భ జలాలు, వ్యవసాయం, భూభౌగోళిక అధ్యయన అంశాలు, భూమి, రాతి పరీక్షల అంశాలపై కోరిన సమాచారాన్ని అందించాలన్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ కోరిన అంశాల ప్రతిని లేఖకు జత చేశారు. ప్రాణహితలోని తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను, మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను విడివిడిగా అంచనా వేశారని.. మొత్తంగా కలిపి నీటి లభ్యతను, వినియోగం పోను మిగిలే జలాలను లెక్కగట్టి తెలపాలని అందులో సీడబ్ల్యూసీ కోరింది. ప్రతి పది రోజులకు ఒకమారు ఎంత నీటి లభ్యత ఉందో చెప్పాలని... ఎల్లంపల్లికి సంబంధించిన అనుమతుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment