‘కాళేశ్వరం’ అనుమతుల్లో వేగం | Kaleshwaram project to be completed in 3 years | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ అనుమతుల్లో వేగం

Published Fri, Mar 24 2017 1:15 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Kaleshwaram project to be completed in 3 years

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), పర్యావరణ అనుమతులను వీలైనంత వేగంగా సాధించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇందుకుగానూ సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ జీఎస్‌ ఝాను ప్రాజెక్టు సేవలకు వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు జీఎస్‌ ఝా పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఆయన ఢిల్లీలోనే అందుబాటులో ఉండి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతల విషయంలో తోడ్పాటు అందిస్తారని ప్రభుత్వానికి వివరించింది.

సీడబ్ల్యూసీనే కీలకం..: ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వడంలో సీడబ్ల్యూసీ పాత్ర కీలకం. దీంతో పాటే జాతీయ హోదా దక్కాలన్నా 18 రకాల కేంద్ర డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్‌లో నీటి లభ్యత(హైడ్రాలజీ), నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు, పర్యావరణ ప్రభావ మదింపు, అటవీ అవసరాలు వంటి అంశాలపై వేర్వేరుగా అధ్యయనం చేసిన నివేదికలు పొందుపరచాల్సి ఉంటుంది.

 ఈ అంశాలను పొందుపరిచిన డీపీఆర్‌తో సీడబ్ల్యూసీని సంప్రదిస్తే, వారు అవసరమైన మార్పులు, చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ డీపీఆర్‌లలో పొందుపరిచి తుది డీపీఆర్‌ని సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. తుది డీపీఆర్‌పై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకి ప్రజంటేషన్‌ ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతుంది. దీంతో పాటే పర్యావరణ మదింపు జరగాలంటే పది అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉంటుంది.

పలు అంశాలపై సూచనలు చేసేందుకు..
ప్రస్తుతం పర్యావరణ మదింపు బాధ్యతలను పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధనా సంస్థ(ఈపీటీఆర్‌ఐ)కి ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే నిత్యం ఈపీటీఆర్‌ఐతో సంప్రదింపులు, రాష్ట్ర అధికారులకు వివిధ అంశాలపై సూచనలు చేసేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌నే కన్సల్టెంట్‌గా పెట్టుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అయితే ఒక్క కాళేశ్వరానికే కాకుండా సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సిన అన్ని ప్రాజెక్టులకు ఝా సేవలను పొడగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement